Begin typing your search above and press return to search.

'పుష్ప 2' వచ్చేది అప్పుడేనా..?

By:  Tupaki Desk   |   2 Feb 2022 11:30 AM GMT
పుష్ప 2 వచ్చేది అప్పుడేనా..?
X
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్' మంచి సక్సెస్ సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన విజయం అందుకుంది. దీంతో ఇప్పుడు రెండో భాగం 'పుష్ప: ది రూల్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ఏమాత్రం తగ్గకుండా పార్ట్-2 చిత్రాన్ని రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

వాస్తవానికి 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలని ముందుగా ప్లాన్ చేయలేదు. అయితే సినిమా ఆలస్యం అవుతూ ఉండటం.. శేషాచలం అడవుల్లో స్మగ్లింగ్ నేపథ్యాన్ని సుకుమార్ రెండు పార్ట్స్ గా చెప్పాలని ఫిక్స్ అవడంతో దీనికి తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటి భాగం పూర్తైన తర్వాత బన్నీ మరో సినిమా చేసి 'పుష్ప 2' మొదలు పెట్టాలని అనుకున్నారు.

బోయపాటి శ్రీను - కొరటాల శివ - ఏఆర్ మురగదాస్ వంటి దర్శకుల్లో ఎవరో ఒకరితో సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు సుకుమార్ సైతం విజయ్ దేవరకొండతో ఓ మూవీ కంప్లీట్ చేసి 'పుష్ప' రెండో భాగం మీద ఫోకస్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఫస్ట్ పార్ట్ అంచనాలకు మించి హిట్ అవడంతో ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. అన్నీ పక్కన పెట్టి ముందుగా 'పుష్ప 2' చిత్రాన్ని చేయాలని ఫిక్స్ అయ్యారు.

'పుష్ప: ది రూల్' చిత్రాన్ని ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చిలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. హీరో అల్లు అర్జున్ సైతం రెండు వారాల దుబాయ్ ట్రిప్ ముగించుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు. కరోనా పరిస్థితులను బట్టి షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసే అవకాశం ఉంది.

ఎప్పుడు చిత్రీకరణ మొదలు పెట్టినా 'పుష్ప' పార్ట్-2 ని 2022 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. మొదటి భాగం అదే రోజున విడుదలై ఘన విజయం సాధించిన నేపథ్యంలో సెటిమెంట్ గా భావిస్తున్నారట.

కాకపోతే ఈసారి విడుదల ముందు రోజు వరకు హడావిడి చేయకుండా.. రెండు నెలల ముందుగానే షూటింగ్ మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మరియు ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇంకా తొమ్మిది నెలలు పైగా సమయం ఉంది కాబట్టి.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులు ఏ విధంగా కోపరేట్ చేస్తాయో చూడాలి.