Begin typing your search above and press return to search.

ఓటీటీ సంస్థల టెంప్టింగ్ అలా ఉంటుందట

By:  Tupaki Desk   |   29 July 2021 5:30 AM GMT
ఓటీటీ సంస్థల టెంప్టింగ్ అలా ఉంటుందట
X
ఇద్దరు ప్రముఖ నిర్మాతలు కలిసి ఒక సూపర్ హిట్ మూవీని రీమేక్ చేశారు. ఆ సినిమాలోనూ స్టార్ హీరో నటించారు. మరి..అలాంటి మూవీపై ఉండే అంచనాలు అన్ని ఇన్ని కావు. అలాంటి సినిమాను థియేటర్లో కాకుండా.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు అమ్మేసే పరిస్థితి ఉంటుందా? అన్న ప్రశ్నను ఆర్నెల్ల క్రితం అడిగితే నో అంటే నో అనే వారు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. ఎప్పుడైతే సెకండ్ వేవ్ షాకిచ్చి.. థియేటర్లు మూసేశారో.. అప్పటి నుంచి చాలా మంది నిర్మాతలు కిందా మీదా పడిపోతున్నారు.

కోట్లాది రూపాయిల్ని ఖర్చు చేసి.. సినిమాల్ని థియేటర్లలో విడుదల చేయాలని డిసైడ్ అయినా.. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో.. ఒకవేళ ఓపెన్ అయినా.. ప్రేక్షకులు వస్తారో? లేదో? అన్న సందేహంతో పాటు ఓటీటీ వాళ్లు ఇచ్చే ఫ్యాన్సీ మొత్తాన్ని వదిలేసి.. ఒక్కో థియేటర్లో ఒక్కో టికెట్ అమ్ముకుంటే వచ్చే చిల్లర పైసల్ని నోట్ల కట్టలుగా మార్చటానికి పడే అవస్థలు గుర్తుకు వచ్చి.. కరోనా లాంటి పాడు కాలంలో రిస్కు తీసుకోవటం ఎందుకన్న ఉద్దేశంతో ఓటీటీకి ఓకే చెప్పేసిన నిర్మాతలు ఉన్నారు.

మరికొందరు.. ధైర్యంగా ఏం జరిగితే అది జరుగుతుందన్న ధీమాతో సినిమా హాళ్ల లోనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకోవటం తెలిసిందే. క్రేజీ సినిమాల్ని థియేటర్లో విడుదల కాకుండా చూసేందుకు ఓటీటీ ఫ్లాట్ పాంలు ఎన్నెన్ని ఎత్తులు వేస్తాయో తెలిస్తే షాక్ తినాల్సిందే.తాజాగా వెంకటేశ్ నటించిన నారప్ప మూవీని థియేటర్లలో విడుదల చేయాల్సి ఉంది. కానీ.. ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద కంటే కూడా వెండితెర మీదే విడుదల చేయాల్సి ఉంది. అయితే.. మరి కొంత కాలం సినిమాను విడుదల చేయకుండా ఉండలేకపోవడం..

అదే సమయంలో ఓటీటీ సంస్థలు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చేసి ఆ సినిమాను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల నెట్ వర్కు ఉన్న నిర్మాత ఒకరు తన సినిమాను ఓటీటీకి ఓకే చెప్పేయటం హాట్ టాపిక్ గా మారింది. దీనికి ఆయన ఎంత వివరణ ఇచ్చినా.. ఇదే చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన మరో ప్రముఖుడు క్షమాపలు చెప్పినా.. థియేటర్లలో విడుదల కావాల్సిన మూవీ.. ఓటీటీలో బయటకు తీసుకొచ్చారన్న భావన ఉంది.

సినిమాను అట్టే కాలం తమ వద్ద ఉంచుకోలేకపోవటం. అంతకంతకూ పెరిగిపోతున్న ఆర్థిక ఒత్తిడి వేళ.. ఓటీటీలు ఇస్తామన్న భారీ ఆఫర్ కు కాదనలేని పరిస్థితి. నారప్ప సైతం అదే రీతిలో బుక్ అయినట్లు చెబుతారు. భారీ ప్రైస్ ను ఆఫర్ చేయటం.. థియేటర్లలో విడుదల ఎప్పుడో అర్థం కాని అనిశ్చితి వేళలో .. ఫ్యాన్సీ రేటు ఇచ్చిన వారిని కాదనలేక.. ఓటీటీ ఫ్లాట్ ఫాంకు ఓకే చెప్పేశారని చెబుతున్నారు. క్రేజీ సినిమాల విషయంలో నిర్మాతల్ని టెంప్ట్ చేసి తమ చేతికి సదరు సినిమా వచ్చేలా చేసుకోవటంలో ఓటీటీ వారు భలే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని చెబుతారు.వీరి దెబ్బకు నిర్మాతలు ఇట్టే పడిపోతారని చెబుతున్నారు.

వీలైనంత ఎక్కువ మందిని తమ ఫ్లాట్ ఫామ్ మీదకు తీసుకొచ్చేలా చేసుకొని.. వారిని తమ ఫ్లాట్ ఫాంకు అడిక్ట్ అయ్యేలా చేయటం.. థియేటర్లకు దూరం చేయటం అసలు లక్ష్యమని చెబుతున్నారు. ఇదే రీతిలో నారప్పను కూడా టెంప్టు చేసి ఓటీటీ బుట్టలో పడేలా చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని సీనియర్ నిర్మాత ఒకరు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పేయటం గమనార్హం.