Begin typing your search above and press return to search.

మంచు విష్ణు బాధ అదేనా..?

By:  Tupaki Desk   |   9 Feb 2022 7:30 AM GMT
మంచు విష్ణు బాధ అదేనా..?
X
సినీ ఇండస్ట్రీలో సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి గత నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. సీఎం ఆహ్వానం మేరకు భేటీ అయ్యాయని తెలిపిన చిరు.. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒడిదుకులను ఆయన దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

సినిమా టికెట్ల ధరలను పెంచాలని.. కోవిడ్‌ దృష్ట్యా కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకోవాలని.. నిర్మాతలు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్లకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. జగన్ తో సమావేశం పూర్తి సంతృప్తిగా జరిగిందని.. త్వరలో ఇండస్ట్రీకి తీపి కబురు వస్తుందని అన్నారు. అయితే సీఎంతో చిరంజీవి భేటీపై ఇటీవల 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేసారు.

ఇటీవల తిరుపతిలో మీడియాతో మంచు విష్ణు మాట్లాడుతూ.. ''చిరంజీవిగారు జగన్‌ ని కలిశారు. అది వ్యక్తిగత సమావేశం. దానిని అసోసియేషన్‌ మీటింగ్‌ గా భావించకూడదు'' అని కీలక వ్యాఖ్యలు చేసారు. టికెట్ ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు నడుచుకుంటామని.. 'మా' అధ్యక్ష పదవిలో ఉన్న కారణంగా వ్యక్తిగత అభిప్రాయాలకు దూరంగా ఉండాలన్నదే తన అభిమతమన్నారు. తాను ఏమి మాట్లాడినా అసోసియేషన్‌ తరపున మాత్రమే ఉంటుందన్నారు. అయితే జగన్ తో చిరు భేటీ గురించి మంచు విష్ణు చేసిన ఈ కామెంట్స్‌‌‌ పై నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేసారు.

చిత్ర పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి ఎవరో ఒకరు ముందడుగు వేస్తున్నప్పుడు.. వీలైతే మద్దతు అందించాలి లేదా సైలెంట్ గా ఉండాలి అని మంచు విష్ణుకు సూచిస్తున్నారు. చిరంజీవి ఇండస్ట్రీ బిడ్డగా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్తుంటే.. అది ఆయన వ్యక్తిగతమని.. అసోసియేషన్‌ మీటింగ్‌ గా భావించకూడదని కామెంట్స్ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ ఏపీలో సినిమా టికెట్ రేట్లు పెంచి.. సినిమా వాళ్ళు అడిగిన కోరికలు తీరిస్తే క్రెడిట్ అంతా మెగాస్టార్ చిరంజీవికి వెళ్తుందని మంచు విష్ణు బాధ అని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసారని విమర్శిస్తున్నారు. అంతేకాదు ఏపీ సీఎంతో దగ్గరి సంబంధాలు బంధుత్వాలు కలిగి ఉన్నప్పటికీ.. ఈ విషయంలో మంచు ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదని.. వాళ్ళని పట్టించుకోలేదనే బాధతో అలా మాట్లాడారని నెటిజన్స్ కామెంట్స్ చేసున్నారు.

'మా' అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి బంధువుగా అసలు ఈ సమస్యను ఇంత వరకు రానీయకుండా చూడాల్సిందని.. అప్పుడు మీరు ఏం మాట్లాడినా దానికో అర్థం ఉండేదని.. ఇప్పుడు చిరంజీవి ఇండస్ట్రీలో సమస్యలపై సమావేశాలు జరుపుతుంటే 'అది పర్సనల్ మీటింగ్' అంటూ మాట్లాడటం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే మంచు విష్ణు అదే మీడియా ముందు మాట్లాడుతూ.. గతంలో రామారావు - నాగేశ్వరరావు ఏవిధంగా పెద్దన్న పాత్ రపోషించారో.. ఇప్పుడు చిరంజీవి - మోహన్‌ బాబు - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేశ్‌ - కృష్ణంరాజు - కృష్ణ పెద్దవాళ్లుగా ఉన్నారన్నారని పేర్కొనడం గమనార్హం.