Begin typing your search above and press return to search.

'నిశ్శబ్దం' దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్నారా...?

By:  Tupaki Desk   |   8 Oct 2020 2:02 PM IST
నిశ్శబ్దం దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్నారా...?
X
రోజుకొక న్యూ టాలెంటెడ్ డైరెక్టర్ పరిచయం అవుతున్న సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే మాములు విషయం కాదు. దీనికి హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా కలిసిరావాలి. ఎందుకంటే వరుసగా హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ అయినా కూడా ఓ ప్లాప్ మూవీ తీస్తే అతన్ని దాదాపు ఇండస్ట్రీ పక్కన పెట్టినట్లే విధంగా పోటీ నెలకొనివుంది. అప్పుడప్పుడు లక్ ఫేవర్ చేస్తే ప్లాప్ వచ్చినా కూడా ఛాన్స్ దక్కుతుంది. ఇప్పుడు డైరెక్టర్ హేమంత్ మధుకర్ కి కూడా అదే జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు బాబురావు తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు హేమంత్. తొలి ప్రయత్నంగా 'ఏ ఫ్లాట్' అనే హిందీ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ తర్వాత తెలుగులో 'వస్తాడు నా రాజు'.. హిందీలో 'ముంబై 125 KM' అనే 3డీ మూవీ తీశాడు. అయితే ఈ సినిమాలేవీ హేమంత్ మధుకర్ ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేయలేదు.

ఈ నేపథ్యంలో ఆరేళ్ళ తర్వాత 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హేమంత్. అనుష్క శెట్టి - ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 2న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో భారీ క్యాస్టింగ్ తో వచ్చిన ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ మరియు సినీ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో 'నిశ్శ‌బ్దం' గురించి అంతా సైలెంట్ అయిపోవ‌డంతో ఈ డైరెక్ట‌ర్ విష‌యంలో కూడా అందరూ సైలెంట్ గానే ఉంటార‌నే కామెంట్స్ ఇండ‌స్ట్రీలో వర్గాల్లో వినిపించాయి. అయితే 'నిశ్శ‌బ్దం' రిజల్ట్ ని పక్కనపెట్టి హేమంత్ మధుకర్ టాలెంట్ ని నమ్మి మాధవన్ మరో అవకాశం ఇస్తున్నాడట. అందులోనూ ఈ చిత్రాన్ని మాధవన్ తన స్వంత ప్రొడ‌క్ష‌న్ లో తీయడానికి ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది.