Begin typing your search above and press return to search.

స్వాతిముత్యానికి నిడివి కూడా ప్లస్ అవుతుందా..?

By:  Tupaki Desk   |   4 Oct 2022 11:30 AM GMT
స్వాతిముత్యానికి నిడివి కూడా ప్లస్ అవుతుందా..?
X
బెల్లంకొండ గణేష్ హీరోగా లాంచ్ అవుతున్న చిత్రం "స్వాతి ముత్యం". లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

రేపు 'గాడ్ ఫాదర్' మరియు 'ది ఘోస్ట్' వంటి రెండు పెద్ద సినిమాలతో 'స్వాతిముత్యం' పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో జనాల దృష్టిని ఆకర్షించడానికి మేకర్స్ ఈ సినిమా కోసం దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరూ టచ్ చేయని స్పెర్మ్ డొనేషన్ అనే పాయింట్ ని 'స్వాతిముత్యం' సినిమాలో చెప్పబోతున్నారు. కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ అయినప్పటికీ చాలా ఫన్నీ నోట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'స్వాతిముత్యం' ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయింది. సెన్సార్ బోర్డ్ దీనికి 'యు/ఏ' (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి చాలా తక్కువ వచ్చినట్లు తెలుస్తోంది. ఫైనల్ రన్ టైమ్ దాదాపు 2 గంటలు (గం. 2:04 నిమిషాలు) వచ్చిందని సమాచారం.

ప్రేక్షకులు ఎక్కడా విసుగు చెందకుండా.. సినిమాకు ఎంత అవసరమే అంతే నిడివితో క్రిస్పీగా ఈ చిత్రాన్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. చిన్న సినిమాలకు తక్కువ రన్ టైం అనేది ఖచ్చితంగా మంచి స్ట్రాటజీ అని చెప్పాలి. రెండు గంటల పాటు ఆడియన్స్ నవ్వుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

'స్వాతిముత్యం' ఫలితంపై పూర్తి నమ్మకంతోనే ఈరోజు హైదరాబాద్‌ లో కొన్ని స్పెషల్ ప్రీమియర్ షోలను నిర్వహిస్తున్నారు. ఈ స్ట్రాటజీ కూడా చిన్న చిత్రాలకు మంచిదే. బరిలో మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జున లాంటి సీనియర్ హీరోలు ఉన్నారు కాబట్టి.. ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇలాంటి వ్యూహాలు పనిచేస్తాయి.

ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సహకారంతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై ఎస్. నాగ వంశీ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో గణేష్ - వర్ష తో పాటుగా నరేష్ వీకే - రావు రమేష్ - సుబ్బరాజు - వెన్నెల కిషోర్ - సునయన - దివ్య శ్రీపాద ఇతర పాత్రలు పోషించారు.

మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా.. సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. వినోద భరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన 'స్వాతిముత్యం'.. విజయదశమికి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.