Begin typing your search above and press return to search.

చైనాలో థియేట‌ర్లు మూసేస్తే మ‌న‌కే న‌ష్టం?

By:  Tupaki Desk   |   4 Jun 2020 8:00 AM IST
చైనాలో థియేట‌ర్లు మూసేస్తే మ‌న‌కే న‌ష్టం?
X
తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజుకు ఎదిగింది. బాహుబ‌లి దేశ విదేశాల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన నేప‌థ్యంలో టాలీవుడ్ రూట్ మారింది. ఇక్క‌డ సినిమా తీస్తే కేవ‌లం స్థానికంగానే కాకుండా విదేశాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసుకోవాల‌న్న స్పృహ పెరిగింది. నిర్మాత‌లు సాహ‌సాలకు ఒడిక‌డుతున్నారు. బాలీవుడ్ వాళ్ల‌కు దంగ‌ల్ సహా ఎన్నో సినిమాలు చైనా మార్కెట్ పై ధీమాను పెంచాయి. ఆ క్ర‌మంలోనే మునుముందు అక్క‌డ భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.

స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో క‌రోనా వైర‌స్ ని పుట్టించింది చైనా. మ‌హ‌మ్మారీని దేశ విదేశాల‌కు పంపించి ప్ర‌పంచ వినాశ‌నానికి పాల్ప‌డింది. ఈ వినాశ‌నం కేవ‌లం ఏ ఒక్క రంగానికో ప‌రిమితం కాలేదు.. అన్ని రంగాల‌పైనా తీవ్రంగా ప‌డింది. ముఖ్యంగా వినోద ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలం అయిపోయింది. ఇండియా మార్కెట్ ని మించి చైనా మార్కెట్ నుంచి కొల్ల‌గొట్టొచ్చు అనుకున్న మ‌న‌ నిర్మాత‌ల‌కు అశ‌నిపాత‌మే అయ్యింది.

క‌రోనా దెబ్బ‌కు ఇప్ప‌టికే థియేట‌ర్లు మూత ప‌డ్డాయి. ఇటు ఇండియా అటు అమెరికా చైనా స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్లు మూసేసారు. అయితే దేశంలో ఆగస్టు నుంచి థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అటు చైనాలోనూ తొంద‌ర్లోనే థియేట‌ర్ల‌ను తెరిచే ఆలోచ‌న ఉందిట‌. అయితే చైనాలో నిర్వ‌హించిన ఓ స‌ర్వే ప్ర‌కారం.. జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు సిద్ధంగా లేర‌ని తేల్చేసాయి.

థియేట‌ర్లు తెర‌వాలా వ‌ద్దా? అన్న‌దానిపై అక్క‌డ 187 థియేటర్లలో ఒక సర్వే నిర్వహించారు. దాదాపు 42% మంది సమీప భవిష్యత్తులో ``థియేట‌ర్లను మూసివేసే అవకాశం ఉంది`` అని అభిప్రాయ‌ప‌డ్డారు. కేవ‌లం 10% యాజ‌మాన్య మార్పుతో మనుగడ సాగిస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు‌. చైనాలోని థియేటర్లు ఇప్ప‌టికే 130 రోజులుగా మూసేశారు. అవి త్వరలో తిరిగి తెరిచినా.. దివాలా వైపు వెళ్ళే ప‌రిస్థితి ఉంద‌ట‌. చైనా వ్యాప్తంగా ఉన్న 69800 సినిమా స్క్రీన్ లలో 40% స్క్రీన్లు మూసివేత ఖాయ‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. అంటే దాదాపు 5 వేల ప్ర‌దేశాల్లో 27920 స్క్రీన్ ల‌ను మూసేసే ఛాన్స్ ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ప‌లు భారీ పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీట‌న్నిటినీ ఇండియాతో పాటు అటు చైనాలోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి- డివివి దాన‌య్య ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ ని చైనాలోనూ భారీగా రిలీజ్ చేయాల‌నే భావించార‌ట‌. ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే అదేమీ సాధ్య‌మ‌య్యేదిగా క‌నిపించ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే ఇది టాలీవుడ్ కి అనూహ్య ప‌రిణామంగానే భావించాల్సి ఉంటుంది.