Begin typing your search above and press return to search.

తార‌క రామారావు మ‌న‌సు రాజ‌కీయాల‌పైకి మ‌ళ్లిందా?

By:  Tupaki Desk   |   11 Aug 2021 7:00 PM IST
తార‌క రామారావు మ‌న‌సు రాజ‌కీయాల‌పైకి మ‌ళ్లిందా?
X
ఏపీలో తెలుగుదేశం ప్ర‌భ అంత‌కంత‌కు త‌గ్గిపోతోంద‌న్న సిగ్న‌ల్స్ స్ప‌ష్ఠంగా క‌నిపిస్తున్నాయి. పాతాళానికి ప‌డిపోయిన తెలుగు దేశం పార్టీని పైకి లేప‌డానికి ఇప్పుడొక యంగ్ డైన‌మిక్ నాయ‌కుడు అవ‌స‌రం క‌నిపిస్తోంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ప్ర‌స్తుతం పార్టీలో ఉన్న బ‌లం స‌రిపోదు. ఉన్న పెద్ద త‌ల‌కాయ‌ల‌కు జ‌నంలో క్రేజ్ ప‌డిపోయింది. చంద్ర‌బాబు ఏజ్ స‌మ‌స్య ప్ర‌తిబంధ‌కంగా మారితే చినబాబు లోకేష్‌ వేవ్ లెంగ్త్ స‌రిపోవ‌డం లేద‌ని ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లున్నాయి. కాబ‌ట్టి పార్టీని ముందుకు న‌డిపించే స‌రైన ఛ‌రిష్మా ఉన్న‌ నాయ‌కుడి అవ‌స‌రం ఎంతైన ఉంద‌ని చాలా కాలంగా వినిపిస్తోంది.

ఆ ఛ‌రిష్మా కేవ‌లం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కే ఉంద‌నేది తేదేపాలో ఓ సెక్ష‌న్ యువ‌నాయ‌కుల‌ మాట‌. కానీ యంగ్ టైగ‌ర్ మాత్రం ఈ వ్య‌వ‌హారంపై ఎటూ తేల్చ‌డంలేదు. అప్ప‌ట్లో తెలుగు దేశం పార్టీ త‌రుపున పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన ఎన్టీఆర్ త‌ర్వాతి కాలంలో పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఇటీవ‌ల‌ పూర్తిగా దూర‌మ‌య్యారు. ప్ర‌స్తుతం సినీకెరీర్ గురించి త‌ప్ప ఏదీ ప‌ట్ట‌డం లేదు. కానీ కుటుంబ ప‌రువు మ‌ర్యాద‌లు కాపాడాల్సిన టైమ్ వ‌చ్చింది. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో ఆయ‌న‌ పార్టీ కోసం ప‌సుపు చొక్కా ధ‌రించి బ‌రిలో దిగుతారా లేదా ! అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే పార్టీల సంగ‌తి అటుంచి యంగ్ టైగ‌ర్ మాత్రం జ‌నాల్లో అభిమాన గ‌ణాన్ని పెంచుకునే ప్ర‌య‌త్నాలు మాత్రం చాలా సీరియ‌స్ గానే సాగిస్తున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది.

ఎన్టీఆర్ పంథా చూస్తుంటే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్గాన్ని అనుస‌రిస్తున్న‌ట్లు ఉంద‌ని విశ్లేషణ‌లు సాగుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీజాల్లోకి రావ‌డం అనుకోకుండా జ‌రిగింది. అన్న‌య్య చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించ‌డం.. ఆ పార్టీలో ప‌వ‌న్ ప‌ని చేయ‌డం అటుపై చిరు పార్టీని మ‌రో పార్టీలో విలీనం చేయ‌డం వంటి స‌న్నివేశాలు న‌చ్చ‌క ప‌వ‌న్ నేరుగా పార్టీ ఏర్పాటు చేసారు. అయితే దానికి ప‌వ‌న్ చాలా క‌స‌ర‌త్తు చేసారు. రాష్ట్ర‌ వ్యాప్తంగా అన్ని జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు.. అభిమానుల్ని క‌ల‌వ‌డం స‌హా కీల‌క వ్య‌క్త‌లతో స‌మావేశం అవ్వ‌డం చేసారు. సానుకూల ప‌రిస్థితులన్నింటిని విశ్లేషించుకునే జ‌న‌సేన పార్టీని ఆవిష్క‌రించారు. ఆ త‌ర్వాత రిజ‌ల్ట్ ఎలా ఉన్నా కానీ పార్టీ అయితే న‌డుస్తోంది.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ప‌వ‌న్ లాగే ఆలోచిస్తున్నాడా? అంటూ అభిమానులు సందిగ్ధం వ్య‌క్తం చేస్తున్నారు. నిరంత‌రం అత‌డు అభిమానుల‌తో ఇంట‌రాక్ట్ అవ్వ‌డం.. ఆన్ సెట్స్ లోనే వాళ్ల‌తో ఫోటోలు దిగ‌డం..ప్ర‌త్యేక విందులు ఏర్పాటు చేయ‌డం వంటి స‌న్నివేశాలు చూస్తుంటే ఇందులో రాజ‌కీయ కోణం ఉందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మునుపెన్న‌డు చూడ‌ని కొత్త జూనియ‌ర్ క‌నిపిస్తున్నార‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో ముచ్చ‌ట వినిపిస్తోంది. మ‌రి తార‌క్ క్యాజువ‌ల్ గానే ఇలా ఇంట‌రాక్ట్ అవుతున్నారా? లేక టీడీపీ బ‌లోపేతం చేసేందుకు త‌న‌వంతుగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారా? ఈ రెండు గాక కొత్త పార్టీ పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నారా? అంటూ ప‌రిప‌రివిధాలుగా విశ్లేష‌ణ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఇక జూనియ‌ర్ కొత్త పార్టీ పెడితే మాత్రం జ‌న‌సేన‌లా నెగెటివ్ రిజ‌ల్ట్ రాకుండా జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. ప‌వ‌న్ ఏ ఉద్ధేశంతో పార్టీని ప్రారంభించినా ఓటుకు నోట్లు పంచ‌డంలో స‌త్తా స‌రిపోలేద‌ని ప్రూవైంది. నిజానికి విలేజ్ స్థాయిలో కార్య‌నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యం లేని జ‌న‌సేన‌ పార్టీకి ఫ‌లితం ఊహించిన‌దే. ఆ త‌ర్వాత ప‌వ‌న్ జ‌రిగిన పొరపాట్ల‌ను విశ్లేషించుకున్నారు. కానీ తార‌క్ బ‌రిలో దిగితే అంత అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని కూడా కొంద‌రు ముంద‌స్తు విశ్లేష‌ణ‌ల్ని చేస్తున్నారు.