Begin typing your search above and press return to search.

పవన్ ఇప్పుడప్పుడే సెట్స్ లో అడుగుపెట్టడం కష్టమే..?

By:  Tupaki Desk   |   11 Jan 2022 6:30 AM GMT
పవన్ ఇప్పుడప్పుడే సెట్స్ లో అడుగుపెట్టడం కష్టమే..?
X
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్.. 'వకీల్ సాబ్' తో రీఎంట్రీ ఇస్తూనే వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ వచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని సినిమాలను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్న పవన్.. దీనికి తగ్గట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో చిత్రాన్ని ప్రారంభించి.. ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన షూటింగులలో పాల్గొన్నారు. అయితే కరోనా మహమ్మారి వచ్చి ప్లాన్స్ అన్నింటినీ తారుమారు చేసింది.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో దగ్గుబాటి రానాతో కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'. సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ సినిమా కంటే ముందే క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో పవన్ 'హరి హర వీరమల్లు' సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. సమ్మర్ కు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆ మధ్య ప్రకటించారు. అయితే కరోనా కారణంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు.

'భీమ్లా నాయక్' సినిమాకు సంబంధించి ఓ పాటతో పాటుగా కొంత ప్యాచ్ వర్క్ షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు 'వీరమల్లు' ఇప్పటి వరకు 55 శాతానికి పైగా కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో జనవరిలోనే ఈ సినిమాల చిత్రీకరణ తిరిగి ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ ప్రణాళిక రెడీ చేసుకున్నారని తెలుస్తోంది.

ఇటీవల తన భార్యా పిల్లలను కలవడానికి పవన్ రష్యా కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే గత వారం హాలిడే ముగించుకుని పవన్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. దీంతో ఈ వారం నుంచి హరి హర వీరమల్లు షూటింగ్ ప్రారంభించడానికి మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టాలని భావించారట. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా వెనక్కి తగ్గుతున్నారని టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ లోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మహమ్మారి బారిన పడ్డారు. పలు పెద్ద సినిమాల షూటింగ్ లు కూడా రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ నెలలో సెట్స్ పైకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. రాబోయే వారాల్లో థర్డ్ వేవ్ నియంత్రణలోకి వస్తే.. ఫిబ్రవరి ప్రారంభంలో కొత్త షెడ్యూల్ ను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోడానికి ప్రయత్నించాలని.. టీకా వేసుకోని వారు తప్పనిసరిగా తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు.

ఇకపోతే కరోనా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పవన్ కళ్యాణ్ ఓ లేఖ విడుదల చేసారు. కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని.. దీని పట్ల అందరూ జాగ్రత్తలు వహిస్తూ నిబంధనలు పాటిస్తూ మహమ్మారిని పారద్రోలాలని పిలుపునిచ్చారు. గతేడాది పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. విందులు సమావేశాలు కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం ఉత్తమమని పవన్ సూచించారు.

పవన్ కళ్యాణ్ ప్రకటన చూస్తూ కరోనా కేసులు ఎక్కువైతే సినిమా షూటింగ్ లకు కూడా దూరంగా ఉండనున్నట్లు భావించవచ్చు. ఇదే జరిగితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల మిగతా చిత్రాలకు ఇబ్బందిగా మారనుంది. ఎందుకంటే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం పవన్ ముందస్తు ప్రణాళికలు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర పార్టీలతో పొత్తులు మరియు తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.

కాగా, పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా కమిట్ అయ్యారు. అలానే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ మూవీ చేయాల్సి ఉంది.