Begin typing your search above and press return to search.

చైనా సినీ ఇండస్ట్రీ పాటిస్తున్న పద్ధతిని ఇండియాలో ప్రవేశపెట్టబోతున్నారా...?

By:  Tupaki Desk   |   15 April 2020 4:00 AM IST
చైనా సినీ ఇండస్ట్రీ పాటిస్తున్న పద్ధతిని ఇండియాలో ప్రవేశపెట్టబోతున్నారా...?
X
కరోనా మహమ్మారి ప్రభావం సినీ ఇండస్ట్రీపై ఏ రేంజ్ లో పడిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా థియేటర్లు మల్టీప్లెక్స్ లు మూతబడిపోయాయి. సినిమా షూటింగులు లేకపోవడంతో దీని మీద ఆధారపడి జీవిస్తున్న కొన్ని వేల కుటుంబాల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పుడు తాజాగా మే 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో సినిమా ఇండ‌స్ట్రీ మీద ఉన్న ఆంక్ష‌లు ఎత్తేయ‌డానికి ఆగ‌స్ట్ వ‌ర‌కు స‌మయం ప‌ట్టే అవ‌కాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతకంటే ఎక్కువ టైమ్ పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. అయితే సినీ ఇండస్ట్రీ మీద లాక్ డౌన్ నిబంధనలు తొలగించిన తర్వాతైనా ప్రేక్షకులను థియేటర్ల దాకా తీసుకురావడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారనుంది. ఈ నేపథ్యంలో 'సినిమా టికెట్ల విక్రయాలు తగ్గించడం' అనే చైనా సినీ ఇండస్ట్రీలో పాటిస్తున్న విధానం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు వచ్చింది.

చైనాలో థియేట‌ర్లు తెరిచాక టిక్కెట్ల విక్ర‌యాలు దాదాపు 30 శాతానికి త‌గ్గించారు. అంటే వంద సీట్లు ఉన్న థియేట‌ర్ లో కేవ‌లం ముప్పై టిక్కెట్లు మాత్ర‌మే అమ్మాలి. ఇదే ప‌ద్ధ‌తిని ఇండియాలో కూడా ప్ర‌వేశ పెట్టే అవకాశం ఉంద‌ని స‌మాచారం. అయితే డిస్ట్రీబ్యూష‌న్, ఎగ్జిబ్యూటింగ్ సెక్టార్స్ లో ఉన్న కొంద‌రు పెద్దలని దీనిపై స్పంద‌న అడగగా.. వారు ఈ ప‌ద్ధ‌తిని పూర్తిగా వ్య‌తిరేకించారని సమాచారం. మ‌ల్టీప్లెక్సులు ఎక్కువుగా ఉన్న చైనాలో ఈ ప‌ద్ధ‌తి వ‌ర్క్ అవుట్ అవుతుంద‌ని, సింగిల్ స్క్రీన్ల మీద వ‌చ్చే రెవెన్యూ పైనే ఎక్కువుగా ఆధార‌ప‌డి న‌డిచే సౌత్ ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీకి ఇది సెట్ అవ్వ‌ద‌ని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఎందుకంటే ఇక్క‌డ థియేట‌ర్స్ లో వివిధ క్లాసులుగా సీట్లు డివైడ్ అవ్వ‌డంతో చైనా లాంటి ప‌ద్ధ‌తిని ఇక్క‌డ పెడితే క్రింది క్లాసులు నుంచి రెవెన్యూ పూర్తిగా తగ్గిపోతుంద‌ని తెలిపారట. అంతేకాకుండా పెద్ద క్లాసులు ద్వారా వ‌చ్చే ఆదాయం కేవ‌లం 14 శాత‌మేనని.. ఇక్క‌డ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని నిర్ణ‌యాలు తీసుకుంటే మ‌ళ్లీ సినిమా ఇండ‌స్ట్రీ త్వ‌ర‌గా పంజుకునే అవ‌కాశం ఉంద‌ని వివ‌రిస్తున్నారట. మొత్తం మీద చైనా చిత్ర పరిశ్రమ వాళ్లు వాడిన ప‌ద్ధ‌తి ఇక్క‌డ మన ఇండస్ట్రీలో కూడా పాటిస్తే ఇక అంతే సంగ‌తులని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.