Begin typing your search above and press return to search.

శ్రద్ధా వాకర్ మర్డర్ కేసుతో శేష్ 'హిట్ 2' కేసుకు సంబంధమేంటి..?

By:  Tupaki Desk   |   24 Nov 2022 5:35 AM GMT
శ్రద్ధా వాకర్ మర్డర్ కేసుతో శేష్ హిట్ 2 కేసుకు సంబంధమేంటి..?
X
ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. శ్రద్దా అనే యువతిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా 35 ముక్కలుగా నరికి అత్యంత కిరాతకంగా హత్య చేయడం... ఫ్రిజ్ లో దాచి మరీ ఆమె శరీర భాగాలను ఢిల్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేయడం సంచలనం సృష్టించింది. అయితే యాదృచ్ఛికంగా ఇప్పుడు ఆ కేసుకి "హిట్ 2" చిత్రానికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి.

వర్సటైల్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ "హిట్: ది సెకండ్ కేస్". నేచురల్ స్టార్ నాని సమర్పణలో శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వైజాగ్ లో జరిగిన ఓ అమ్మాయిల హత్య కేసు నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో బుధవారం "హిట్ 2" ట్రైలర్ ను విడుదల చేశారు. అమ్మాయిల శరీర భాగాలను వేరు చేసి అతి కిరాతకంగా హత్య చేస్తున్న నర హంతకుడిని పట్టుకోవడాన్ని ఈ ట్రైలర్ ఉత్కంఠ భరితంగా చూపించారు. ఇది ఢిల్లీలో జరిగిన శ్రద్ధా హత్య కేసును గుర్తు చేస్తోంది. అందులోనూ ఈ సినిమాలో శ్రద్ద అనే అమ్మాయి పాత్ర కూడా వుంది.

ఇదే విషయాన్ని ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా మిత్రులు ప్రస్తావించారు. దీనికి అడివి శేష్ స్పందిస్తూ.. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. శ్రద్ధా వాకర్ లాగే మా సినిమాలో శ్రద్ధ అనే క్యారెక్టర్ ఉండటం.. నోయిడాలో జరిగిన ఓ సంఘటననే మా సినిమాలో ఒక కేసుగా వివరించడం.. ఇదంతా అనుకోకుండా జరిగింది అని చెప్పారు.

"శ్రద్ధా వాకర్ హత్య దుర్ఘటన జరగడానికి ఎన్నో నెలల ముందే శైలేశ్ ఈ కథ రాసుకున్నారు. 'హిట్' పార్ట్-1 రిలీజైనప్పుడు కూడా ఇలానే ఔటర్ రింగ్ రోడ్ వద్ద దిశ సంఘటన జరిగింది. ఇలాంటి ఘటన జరగాలని ఎవరూ కోరుకోరు. సినిమాలో కేసుకి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి సిలారిటీస్ ఉండటం యాదృచ్ఛికంగా జరిగింది మాత్రమే" అని శేష్ వివరించారు.

సమాజంలో హింసను ప్రేరేపించేలా కొన్ని సినిమాలు ఉంటున్నాయనే విమర్శలపై దర్శకుడు శైలేష్ కొలను స్పందిస్తూ.. "క్రైమ్ సినిమాలు తెరకెక్కించేటప్పుడు దానిలోని తీవ్రతను ఎక్కువగా చూపించకూడదు. ఆ విషయంలో మేమెంతో కేర్ తీసుకున్నాం. ఒక చెడుపై మంచి ఎలా గెలుస్తుంది? అన్న కోణంలోనే ఈ సినిమా తెరకెక్కించాం. క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లు కేవలం సినిమాలు చూసే అలాంటి పనులు చేస్తున్నారని అనుకోవడానికి లేదు" అని అన్నారు.

కాగా, "హిట్ 2" చిత్రంలో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌ లో కూల్ కాప్ కృష్ణ దేవ్ పాత్రలో శేష్ నటించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా.. తనికెళ్ళ భరణి - శ్రీకాంత్ మాగంటి - కోమలి ప్రసాద్ ఇతర పాత్రల్లో కనిపించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.