Begin typing your search above and press return to search.

దేవీ మ్యూజిక్ సరిలేరు కు పెద్ద మైనస్ కానుందా?

By:  Tupaki Desk   |   8 Jan 2020 5:26 AM GMT
దేవీ మ్యూజిక్ సరిలేరు కు పెద్ద మైనస్ కానుందా?
X
ఒక సినిమా విజయం సాధించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ వాటిలో సంగీతం ముఖ్యమైనది. సంగీతం రెండు రకాలు నేపథ్య సంగీతం.. పాటలు. వీటిలో ఏ ఒక్కటి మైనస్ గా మారినా సినిమా విజయావకాశాలు దెబ్బ తింటాయి. సంక్రాంతి సినిమాల విషయమే తీసుకుంటే 'అల వైకుంఠపురములో' పాటలు ఇప్పటికే సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ పోటీలో విడుదలవుతున్న మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' పాటలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. దీంతో దేవీశ్రీ ప్రసాద్ పాటలు'సరిలేరు నీకెవ్వరు' కు పెద్ద మైనస్ గా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది. 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ట్రైలర్లలో నేపథ్య సంగీతం బాగుంది కానీ పాటలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలంటే ప్రేక్షకులు రెండు మూడు సార్లు థియేటర్లో సినిమా చూడాలి.. రిపీట్ ఆడియన్స్ ఉండాలి. 'ఒకసారి చూడొచ్చు' అనిపిస్తే ఆ సినిమా యవరేజ్ గా మిగిలి పోయే అవకాశాలే ఎక్కువ. అయితే మంచి పాటలు ఉంటే రిపీట్ ఆడియన్స్ పెరుగుతారు. 'రంగస్థలం' లాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందంటే అందులో కంటెంట్ తో పాటుగా పాటలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' విషయం తీసుకుంటే ఒక్క పాట కూడా సూపర్ అనే స్థాయిలో లేదు. అన్నీ సోసోగానే ఉన్నాయి. ఇలాంటి పాటల కోసం ప్రేక్షకులు సినిమా థియేటర్ కు పోవడం కష్టం. దీంతో 'సరిలేరు నీకెవ్వరు' విజయం సాధించడం అంతా కంటెంట్.. మహేష్ మాస్ హీరోయిజం పైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అది ప్రేక్షకులకు కనెక్ట్ అయినా పాటల బలం లేకుండా రిపీట్ ఆడియన్స్ రావడం కష్టం.

ఇలాంటి పరిస్థితి నిజంగా అనిల్ రావిపూడికి కత్తి మీద సామే అని చెప్పాలి. ఎప్పుడూ సూపర్ హిట్ ఆడియోలు అందించే దేవీ శ్రీ ప్రసాద్ నుంచి ఇలాంటి పాటలు రావడంతో సరిలేరు టీమ్ కూడా మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతోంది అనేది మరో మూడు రోజుల్లోనే తెలిసిపోతుంది లెండి.