Begin typing your search above and press return to search.

భీమ్లా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయినట్లేనా..?

By:  Tupaki Desk   |   24 Feb 2022 6:36 AM GMT
భీమ్లా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయినట్లేనా..?
X
కరోనా థర్డ్ వేవ్ పాండమిక్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న పెద్ద సినిమా ''భీమ్లా నాయక్''. రేపు శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్‌ గా నిర్వహించారు. పాసులకు సంబంధించి ఫ్యాన్స్ మధ్య ఆందోళనలు జరిగినా.. ఈవెంట్ మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా ముగిసింది.

'భీమ్లా' కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలానే సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని యాదవ్ స్పెషల్ గెస్టుగా అటెంట్ అయిన ఈ వేడుకలో.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు తెలంగాణకు చెందిన రాజకీయ పెద్దలు పాల్గొన్నారు. ఇందులో టాలీవుడ్ ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని విషయాల్లోనూ తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని.. టిక్కెట్ రేట్లు, ఐదో షో.. ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తుందని అందరూ కేసీఆర్ సర్కారును కొనియాడారు.

పవన్ కళ్యాణ్ ఈ స్టేజీ మీద ఏం మాట్లాడతారో అనే ఆసక్తి మొదటి నుంచీ అందరిలో నెలకొంది. చివరిసారిగా 'రిపబ్లిక్' సినిమా ఈవెంట్‌ లో పవన్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భీమ్లా ఈవెంట్ లో మాట్లాడతారోనని అందరి దృష్టి ఆయనపై పడింది. కానీ పవన్ మాత్రం ఎలాంటి వివాదాలకు తావులేకుండా సింపుల్ గా స్పీచ్ ఇచ్చారు. దాదాపు పది నిమిషాలకు పైగా మాట్లాడిన పవన్.. చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ తెలంగాణా ప్రభుత్వాన్ని కొనియాడారు.

''చిత్ర పరిశ్రమకి రాజకీయాలు ఇమడవు. ఇది కళాకారులు కలిసే ప్రాంతమిది. నిజమైన కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అనేది పట్టదు. అన్నిటికీ అతీతంగా ఎక్కడో చెన్నైలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌ కి తీసుకురావాలని ఎందరో పెద్దలు సంకల్పించి తీసుకువచ్చారు. ఈరోజు ఈ పరిశ్రమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకువెళ్లేలా ప్రోత్సాహం అందిస్తున్నారు'' అని పవన్ అన్నారు.

ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ - డ్రమ్స్ స్పెషలిస్ట్ శివమణి కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా శివమణి వెళ్లి హీరో పవన్‌ కళ్యాణ్‌ ను, మంత్రి కేటీఆర్‌ ను స్టేజీ మీదకు తీసుకొచ్చి వారితో డ్రమ్స్ వాయించేలా చేశారు. పవన్ - కేటీఆర్ ఇద్దరూ కూడా డ్రమ్స్ వాయించడం హైలైట్ గా నిలిచింది. ఎప్పటిలాగే అందరూ పవన్ గురించి మాట్లాడుతుంటే.. అభిమానులు కేరింతలు కొట్టారు.

పవన్ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఈ ఈవెంట్ లో 'భీమ్లా నాయక్' రిలీజ్ ట్రైలర్ ని వదిలారు. ఫస్ట్ కట్ చేసిన ట్రైలర్ కు మిశ్రమ స్పందన రాగా.. కొత్త ట్రైలర్ మాత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముందు థమన్ ని ట్రోల్ చేసినవారు సైతం.. సాలిడ్ బీజీఎమ్ ఇచ్చారని మెచ్చుకున్నారు. మొత్తం మీద అభిమానుల కోలాహలం మధ్య జరిగిన పవన్ సినిమా ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయిందనే అనుకోవాలి.

ఇప్పటికే ''భీమ్లా నాయక్'' సినిమా నుంచి వచ్చిన టీజర్లు - పాటలు సినిమాకు మంచి బజ్ తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో నిన్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజయవంతం కావడమే కాదు.. రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ లో పవన్ సినిమా సత్తా చాటుతోంది. ఓపెన్ అయిన అన్గాన్ని ఏరియాలలో దాదాపుగా ఫస్ట్ డే ఫుల్ అయ్యాయి. యూఎస్ ప్రీమియర్స్ నుంచి వచ్చే ఫస్ట్ టాక్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.