Begin typing your search above and press return to search.

పవన్‌ తో బండ్ల 100 కోట్ల ప్రాజెక్ట్‌ నిజమెంత?

By:  Tupaki Desk   |   28 May 2019 7:23 PM IST
పవన్‌ తో బండ్ల 100 కోట్ల ప్రాజెక్ట్‌ నిజమెంత?
X
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. జనసేన పార్టీ సింగిల్‌ డిజిట్‌ ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంటుందని మొదటి నుండే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కాని పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆ పార్టీ నుండి గెలవలేక పోయాడు. జనసేన పార్టీ తరపున పోటీ చేసిన ఒకే ఒక్క వ్యక్తి గెలిచాడు. రాజకీయాల్లో దారుణమైన ఫలితాన్ని చవి చూసిన పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలను వదిలేస్తాడేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని తాను రాజకీయాల్లోనే కొనసాగుతాను అని.. ప్రజల తీర్పును గౌరవించి వారికి మద్దతుగా నిలుస్తానంటూ పవన్‌ ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెల్సిందే. ఇక ఆర్థిక అవసరాల నిమిత్తం పవన్‌ కళ్యాణ్‌ సినిమాలను చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

గత రెండు మూడు రోజులుగా పవన్‌ కళ్యాణ్‌ తో నిర్మాత బండ్ల గణేష్‌ చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణంకు దూరం అయిన బండ్ల గణేష్‌ మళ్లీ ఎలా పవన్‌ కళ్యాణ్‌ ను ఒప్పించే ప్రయత్నాలు మరి. పవన్‌ కళ్యాణ్‌ కు ఏకంగా 40 కోట్ల పారితోషికం ఆఫర్‌ చేశాడని.. దర్శకుడిగా బోయపాటిని ఫైనల్‌ చేసినట్లుగా కూడా కుప్పలు తెప్పలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బోయపాటికి 10 కోట్ల పారితోషికం కాగా.. ఇతర ప్రొడక్షన్‌ కు మేకింగ్‌ కు కలిపి మరో 50 కోట్లను బండ్ల బాబు ఖర్చు చేస్తానంటూ చెబుతూ తిరుగుతున్నాడట.

గతంలో ఒకసారి బండ్ల గణేష్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక నిర్మాత వద్ద పైసా లేకున్నా కూడా పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ డేట్లు ఉంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే వద్దంటే ఫైనాన్స్‌ చేసేందుకు ఫైనాన్షియర్స్‌ ముందుకు వస్తారు అన్నాడు. ఇప్పుడు అదే తరహాలో పవన్‌ ను ఒప్పించి ఆ తర్వాత ఫైనాన్షియర్స్‌ ను బండ్ల బాబు ఒప్పించే ప్రయత్నం చేస్తాడేమో అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పవన్‌ తో బండ్ల బాబు సినిమా వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే బండ్ల గణేష్‌ స్పందించాలి.