Begin typing your search above and press return to search.

హాలీవుడ్ పై మ‌న‌సు పారేసుకున్న ఆలియా

By:  Tupaki Desk   |   9 July 2021 7:30 AM GMT
హాలీవుడ్ పై మ‌న‌సు పారేసుకున్న ఆలియా
X
బాలీవుడ్ ట్యాలెంటెడ్ గాళ్ ఆలియా భట్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్- బ్ర‌హ్మాస్త్ర- గంగూబాయి కతియావాడి లాంటి భారీ చిత్రాల్లో న‌టిస్తోంది. ఇవ‌న్నీ త్వ‌ర‌లోనే రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి. ఇటీవ‌లే డార్లింగ్స్ అనే చిత్రంతో ఆలియా నిర్మాత‌గానూ ఆరంగేట్రం చేస్తోంది. తాను న‌టిస్తూనే షారూక్ ఖాన్ సంస్థ‌తో క‌లిసి చిత్ర‌నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ అనే చిత్రంలోనూ అలియా ప్రధాన పాత్రను పోషిస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు.. ఆలియా భట్ హాలీవుడ్ కెరీర్ పై దృష్టి సారించార‌ని తెలిసింది. త‌నే ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్లడించింది. ప్రముఖ హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీ డీఎంఈతో ఒప్పందం కుదుర్చుకుందిట‌. హాలీవుడ్ లో త‌దుప‌రి కొన్ని భారీ ప్రాజెక్టులకు సంబంధించిన‌ ఆడిషన్స్ ఇస్తుందని భావిస్తున్నారు. తన హాలీవుడ్ కలలను నెరవేర్చుకునేందుకు ఆలియా తన సీనియర్ న‌టీమ‌ణుల బాట‌ను అనుస‌రించ‌నుందిట‌.

హాలీవుడ్ లో ఇంత‌కుముందు షబానా ఆజ్మీ- నందితా దాస్ - ట‌బు వంటి సీనియ‌ర్లు న‌టించారు. ఐశ్వ‌ర్యారాయ్ ఓ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా స‌హా భార‌తీయ సంత‌తి న‌టీమ‌ణులు హాలీవుడ్ లో పాపుల‌ర‌వుతున్నారు. పీసీ త‌ర‌హాలోనే తాను కూడా పెద్ద స్టార్ అవ్వాల‌ని ఆలియా క‌ల‌లుగంటోంద‌ట‌. ఆలియా ఆలోచ‌న‌లు చూస్తుంటే ఒక న‌టిగా ఎల్ల‌లు చెరిపోయాల‌నే త‌ప‌న‌తో ఉన్న‌ట్టు స‌న్నిహితులు చెబుతున్నారు.