Begin typing your search above and press return to search.

'18 పేజెస్' ఇప్పట్లో కష్టమేనా..?

By:  Tupaki Desk   |   1 April 2022 6:30 AM GMT
18 పేజెస్ ఇప్పట్లో కష్టమేనా..?
X
యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్ - అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం "18 పేజెస్". స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ - స్క్రీన్‌ ప్లే అందించిన ఈ చిత్రాన్ని 'కుమారి 21 ఎఫ్‌' ఫేమ్‌ పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు.

ఒక వైవిధ్యమైన ప్రేమ కథాంశంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల చేయాలని అనుకున్నారు.

కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జూన్ లేదా జూలైలో '18 పేజెస్' సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పట్లో సరైన రిలీజ్ డేట్ దొరికే పరిస్థితి లేదని తెలుస్తోంది.

కోవిడ్ పాండమిక్ తర్వాత ఎప్పుడు ఏ సినిమా థియేటర్లలోకి వస్తుందో తెలియడం లేదు. వాయిదా పడిన పెద్ద సినిమాలన్నీ ఒక్కటొక్కటిగా రిలీజ్ కు రెడీ అవుతుండటంతో చిన్న మీడియం రేంజ్ సినిమాలకు మంచి తేదీ దొరకడం కష్టంగా మారింది.

ఇప్పటికే సమ్మర్ సీజన్ మొదలుకొని ఆగస్ట్ వరకు డేట్స్ అన్నీ క్రేజీ సినిమాలకు బ్లాక్ అయిపోయాయి. మధ్యలో సరైన విడుదల తేదీని కనుగొనడానికి నిఖిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సినిమాల విడుదలలో గందరగోళం కారణంగా సెప్టెంబర్ వరకు '18 పేజెస్' కు చోటు లభించే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది.

2019లో 'అర్జున్ సురవరం' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్.. వీలయినంత త్వరగా తన తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. కాకపోతే ఇప్పట్లో సరైన రిలీజ్ డేట్ దొరుకుతుందో లేదో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా, "18 పేజెస్" చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు మంచి డేట్ ని లాక్ చేస్తారేమో చూడాలి.