Begin typing your search above and press return to search.

శుభవార్త.. ఆ నటుడు సినిమా చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   6 April 2019 12:43 PM IST
శుభవార్త.. ఆ నటుడు సినిమా చేస్తున్నాడు
X
ఇండియాలో గత రెండు దశాబ్దాల్లో వచ్చిన అత్యుత్తమ.. ప్రపంచ స్థాయి నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకడు. బాలీవుడ్లో చిన్న సినిమాలతో ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత గొప్ప స్థాయికి ఎదిగాడతను. హాలీవుడ్లో ‘లైఫ్ ఆఫ్ పై’, ‘జురాసిక్ వరల్డ్’ లాంటి భారీ ప్రాజెక్టుల్లోనూ అతను నటించాడు. ఇక హిందీలో ఇర్ఫాన్ చేసిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చివరగా ‘హిందీ మీడియం’ లాంటి అద్భుతమైన సినిమాను అందించిన ఇర్ఫాన్.. కొన్ని నెలల కిందట అరుదైన క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడి కావడం అతడి అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరినీ కలచి వేసింది. దాదాపు ఏడాది పాటు లండన్‌లోనే ఉంటూ అతను చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక దశలో తాను బతుకుతానా లేదా అని సందేహం వ్యక్తం చేస్తూ ఇర్ఫాన్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక బాధాకర మెసేజ్ అందరినీ కలచి వేసింది. ఐతే అదృష్టవశాత్తూ అతను కోలుకున్నాడు.

ఇర్ఫాన్‌కు సోకిన అరుదైన క్యాన్సర్ దాదాపుగా నయమైంది. కొన్ని నెలల కిందటే ఇండియాకు తిరిగొచ్చి అప్పుడప్పుడూ లండన్ వెళ్లి వస్తున్న ఇర్ఫాన్.. పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. అతను మళ్లీ సినిమాల్లో నటించడాానికి రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. ఇర్ఫాన్ కొత్త సినిమాను కూడా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. తన కెరీర్లో మైలురాయిలా నిలిచిన ‘హిందీ మీడియం’ సీక్వెల్‌ తోనే ఇర్ఫాన్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి ‘అంగ్రేజీ మీడియం’ అనే టైటిల్ ఖరారు చేయడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో మొదలైంది. హోమీ అడ్జానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇర్ఫాన్ భార్య పాత్రలో కరీనా కపూర్ నటిస్తోంది. ఒక దశలో బతకడమే కష్టం అనుకున్న ఇర్ఫాన్.. ఇలా కోలుకుని మళ్లీ సినిమాలు చేయడంతో అభిమానులతో పాటు బాలీవుడ్ జనాలు చాలా సంతోషంగా ఉన్నారు.