Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: బోస్ మిస్టరీపై గుమ్నామీ

By:  Tupaki Desk   |   23 Jan 2019 3:27 PM IST
ఫస్ట్ లుక్: బోస్ మిస్టరీపై గుమ్నామీ
X
ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. భారత దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపే నేతాజీ అదృశ్యం అయిన సంగతి తెలిసిందే. అయన విమాన ప్రమాదంలో మరణించారని కొందరు.. కాదు ఆయన ఒక బాబాలా మారిపోయి హిమాలయాల్లో అజ్ఞాత జీవితం గడిపారని మరికొందరు.. ఇలా ఎన్నో రకాల వాదనలు ప్రచారంలో ఉన్నాయి. అయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే నేతాజీ జీవితంపై బాలీవుడ్ లో 'గుమ్నామీ' అనే టైటిల్ తో ఒక హిందీ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు క్యాప్షన్ 'ది గ్రేటెస్ట్ స్టొరీ నెవర్ టోల్డ్'.

నేతాజీ జయంతి సందర్భంగా 'గుమ్నామీ' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను అనూజ్ ధర్.. చంద్రచూడ్ ఘోస్ లు రాసిన 'కోనండ్రమ్'(క్లిష్టమైన.. తికమక పెట్టే సమస్య లేదా ప్రశ్న అని అర్థం) అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో ఒక వృద్ధుడు ఒక నవారు మంచంపై కూర్చొని గోడవైపు తదేకంగా చూస్తున్నాడు. ఆ గోడపై 'నేతాజీ మిస్సింగ్'.. బోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడు'..ఇలా నేతాజీకి సంబంధించిన వార్తలు ఉన్న పేపర్ క్లిప్పింగ్స్ అంటించి ఉన్నాయి. ఎడమ వైపు ఒక పాతకాలం ఇనప పెట్టె.. ఆ పెట్టెపై వెలుగుతున్న లాంతరు ఉన్నాయి.

భారతదేశంలో ఎంతోమంది ఫ్రీడం ఫైటర్స్ ఉన్నప్పటికీ వారందరిలో నేతాజీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయన జీవితానికి.. మిస్టరీగా మిగిలిపోయిన మరణానికి సంబంధించిన సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం సహజం. శ్రీజిత్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.