Begin typing your search above and press return to search.

పవన్-హరీష్ సినిమా పోస్టర్ ఏం చెబుతోంది?

By:  Tupaki Desk   |   3 Sept 2020 8:00 AM IST
పవన్-హరీష్ సినిమా పోస్టర్ ఏం చెబుతోంది?
X
పవన్ కళ్యాణ్ అభిమానులకు బుధవారం మామూలు విందు కాదు. పవన్ సినిమాలకు సంబంధించి అసలు ఏ విశేషమూ లేకుండా గత రెండు పుట్టిన రోజులు గడిచిపోతే.. ఈసారి మాత్రం ఒకటికి నాలుగు అప్ డేట్లతో అభిమానుల్ని మురిపించారు. ఇందులో అన్నింట్లోకి అభిమానుల్ని ఎగ్జైట్ చేసింది హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయబోయే కొత్త సినిమా పోస్టరే అనడంలో సందేహం లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు ‘గబ్బర్ సింగ్’ రావడం.. కొత్త సినిమా పోస్టర్లో అనేక విశేషాలు కనిపించడమే అందుక్కారణం. ఇంతకుముందు పూర్తి స్థాయి ఎంటర్టైనర్ చేసిన వీళ్లిద్దరూ.. ఈసారి వినోదానికి తోడు ఆలోచింపజేసే కథతో సినిమా చేస్తున్నారని కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఆ పోస్టర్లో కనిపించిన విషయాలు చూసి అభిమానులు రకరకాల ఆలోచనల్ని ట్విట్టర్లో పంచుకున్నారు.

బ్యాగ్రౌండ్లో ఢిల్లీలోని ఇండియా గేట్ కనిపించడాన్ని బట్టి ఈ సినిమా దేశ రాజధాని నేపథ్యంలో నడుస్తుందన్నది స్పష్టం. దాని మీదే సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మలు కనిపించాయి. ఇందులో ఒకరు ఆవేశానికి ప్రతీక. మరొకరికి గొప్ప ఆలోచనపరుడిగా పేరుంది. ఇక కిందేమో అల్ట్రా మోడర్న్ బైక్ ఉంది. దీన్ని బట్టి హీరో చాలా స్టైలిష్‌గానూ ఉంటాడని చెబుతున్నారు. పెద్ద బాల శిక్ష పుస్తకం అంటే పవన్‌కు ఎంతో ఇష్టం. కొన్ని సందర్భాల్లో ఆ విషయాన్ని చెప్పుకున్నాడు. సినిమాలో హీరో జ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తి చూపిస్తాడనడానికి ఇది రుజువు కావచ్చు. దాని పక్కనే రోజా పువ్వుంది. అంటే అమ్మాయితో ప్రేమ వ్యవహారమూ ఉంటుందన్నమాట. వినోదానికి ఢోకా లేకుండానే పవన్ ఆలోచనకు తగ్గ ఆదర్శాల నేపథ్యంలో సీరియస్‌గానూ కథ సాగుతుందని.. పోస్టర్లో కనిపించిన విషయాలు, ‘దిస్ టైమ్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్’ అనే క్యాప్షన్ స్పష్టం చేస్తున్నాయి.