Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమా.. సైన్స్ ఫిక్షన్ ప్లస్ గాడ్!

By:  Tupaki Desk   |   3 Jun 2020 1:00 PM GMT
ప్రభాస్ సినిమా.. సైన్స్ ఫిక్షన్ ప్లస్ గాడ్!
X
నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని కాంబినేషన్ ఒక్కసారిగా తెరపైకి రావడంతో సినిమా ప్రకటన నాడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుందని ఫిలింమేకర్లు ప్రకటించడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా మూలకథ.. జోనర్ పై ఇప్పటికే పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.

ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అని.. జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సోషల్ ఫ్యాంటసీ అని పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఫిలిం నగర్ లో వినిపిస్తున్న ఫ్రెష్ టాక్ ఏంటంటే ఈ సినిమా కథ సైన్స్.. దేవుడు అనే అంశాల చుట్టూ తిరుగుతుందట. అలా అని ఇదో భక్తిరస చిత్రం కాదట. పైకి సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా కనిపిస్తుంది కానీ అంతర్లీనంగా దేవుడికి సంబంధించిన అంశాలను చర్చిస్తారట. దీన్నో కొత్త జోనర్ సినిమా కింద పరిగణించాలని అంటున్నారు.

నాగ్ అశ్విన్ తొలి చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం' కూడా సెకండ్ హాఫ్ లో ఫిలాసఫీ టచ్ ఉంటుంది. హీరో పాత్ర "నేనెందుకు పరిగెడుతున్నాను. దేని వెనక ఈ ఉరుకులు పరుగులు?" అనే ఆలోచనతో తన మైండ్ సెట్ మార్చుకుని 'శాంతి' లభించినట్టుగా ఫీల్ అవుతాడు. పైకి చూస్తే వేదాంతం లాగా కనిపించకపోయినా అది వేదాంతానికి సంబంధించిన పాయింట్లే అవి. మరి అలాగే ఈ సినిమాలో దేవుడికి సంబంధించిన పాయింట్లను నాగ్ అశ్విన్ చర్చిస్తాడేమో వేచి చూడాలి.