Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' నుంచి స్ఫూర్తిదాయక గీతం 'కదులు కదులు'

By:  Tupaki Desk   |   7 April 2021 3:06 PM IST
వకీల్ సాబ్ నుంచి స్ఫూర్తిదాయక గీతం కదులు కదులు
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన చిత్రం "వకీల్ సాబ్". మరో రెండు రోజుల్లో ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగం పెంచిన చిత్ర బృందం.. ఇప్పటికే ట్రైలర్ - పాటలతో సినిమాపై బజ్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ చేయలేకపోయిన "కదులు కదులు" అనే పాట లిరికల్ వీడియోని తాజాగా విడుదల చేశారు.

'కదులు కదులు కదులు.. కట్లు తెంచుకుని కదులు.. వదులు వదులు వదులు.. బానిస సంకెళ్లను' అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. దీనికి థమన్ స్వరాలు సమకూర్చారు. 'గాజుతో గాయాలు చెయ్.. చున్నీనే ఉరితాడు చెయ్.. రంగులు పెట్టే గోళ్లనే గుచ్చే బాకులు చెయ్' అంటూ మహిళలలను చైతన్య పరిచేలా ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ స్ఫూర్తిదాయక పాటకు సాహిత్యం అందించారు. సింగర్స్ శ్రీ కృష్ణ - హేమచంద్ర కలిసి ఈ గీతాన్ని ఆలపించారు.

'వకీల్ సాబ్' నుంచి ఇదివరకే విడుదలైన 'మగువా' 'సత్యమేవ జయతే' 'కంటిపాప' సాంగ్స్ తరహాలోనే 'కదులు కదులు' పాట కూడా అలరిస్తోంది. థమన్ ఈ సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా నాలుగు పాటలను సమకూర్చినట్లు అర్థం అవుతుంది. ఇకపోతే ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అంజలి - నివేదా థామస్ - అనన్య - ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. బోనీ కపూర్ సమర్పించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మించారు.