Begin typing your search above and press return to search.

'ఇందువదన' ట్రైలర్: ఆత్మ - మనిషి మధ్య ఆసక్తికరమైన ప్రేమకథ..!

By:  Tupaki Desk   |   28 Dec 2021 3:00 PM IST
ఇందువదన ట్రైలర్: ఆత్మ - మనిషి మధ్య ఆసక్తికరమైన ప్రేమకథ..!
X
'హ్యాపీ డేస్' 'కొత్తబంగారు లోకం' తదితర చిత్రాలతో యువతని ఆకట్టుకున్న హీరో వరుణ్ సందేశ్.. కొన్నాళ్ల విరామం అనంతరం ఇప్పుడు ''ఇందువదన'' అనే సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. ఎం.శ్రీనివాసరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫర్నాజ్ శెట్టి కథానాయికగా నటించింది. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ''ఇందువదన'' సినిమాని.. కొత్త ఏడాదిలో జనవరి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సినిమా రిలీజ్ ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. 'ఆత్మా మనిషి కలిసి ఉండగలవా?' అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఆసక్తికరంగా సాగింది.

ఇదొక రూరల్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన పీరియాడికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. వాసు - ఇందు అనే ప్రేమ జంటగా వరుణ్ సందేశ్ - ఫర్నాజ్ కనిపిస్తున్నారు. అయితే హీరోయిన్ ని దెయ్యంగా పరిచయం చేసి.. మనిషికి ఆత్మకు మధ్య ప్రేమ గురించి ప్రస్తావించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆత్మ అయిన ఇందు నుంచి వాసుని తీసుకెళ్లడానికి అతని స్నేహితులు పడే తిప్పలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇందు ని ఎవరు అంతం చేశారు? ఆత్మ - మనిషి మధ్య ఆసక్తికరమైన ప్రేమకథ ఏంటి? చివరకు ఇందు - వాసు లవ్ స్టొరీ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే ''ఇందువధన'' సినిమా చూడాల్సిందే.

ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అని ట్రైలర్ లో మేకర్స్ పేర్కొన్నారు. వరుణ్ సందేశ్ ఇందులో డిఫరెంట్ మేకోవర్ తో కనిపించాడు. అలానే హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. రఘు బాబు - అలీ - నాగినీడు - సురేఖ వాణి - ధనరాజ్ - తాగుబోతు రమేష్ - మహేష్ విట్ట - పార్వతీషం - వంశీ కృష్ణ ఆకేటి - దువ్వాసి మోహన్ - జ్యోతి - కృతిక - అంబఋషి - ‘జెర్సీ’ మోహన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.

ఈ చిత్రానికి కథ, మాటలు సతీష్ ఆకేటీ అందించగా.. శివ కాకాని సంగీతం సమకూర్చారు. బి. మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ అందించగా.. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేశారు. బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై మాధవి ఆదుర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షోతో భారీ క్రేజ్ సంపాదించుకున్న వరుణ్ సందేశ్.. లవ్ - థ్రిల్లింగ్ - హారర్ అంశాలతో రూపొందిన ‘ఇందువదన’ చిత్రంతో సాలిడ్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.