Begin typing your search above and press return to search.

గాడ్ ఫాదర్ లో విలన్ అతనేనా..?

By:  Tupaki Desk   |   14 Sep 2022 5:30 AM GMT
గాడ్ ఫాదర్ లో విలన్ అతనేనా..?
X
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ''గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతున్నారు.

'గాడ్ ఫాదర్' అనేది ఒక హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇది మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన 'లూసిఫర్‌' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రచయిత లక్ష్మీ భూపాల - మోహన్ రాజా కలిసి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు టాక్.

ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించనుండగా.. నయనతార - సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. సునీల్ - సముద్ర ఖని - తాన్యా రవిచంద్రన్ - బ్రహ్మాజీ - మురళీ శర్మ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అయితే వీళ్ళల్లో మెయిన్ విలన్ పాత్ర ఎవరు చేసారనేది తెలియకుండా ఉంది.

ఇప్పటికే టీజర్ ను లాంచ్ చేసిన చిత్ర బృందం.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్ల‌తో పాటుగా పాటలను విడుదల చేయడానికి రెడీ అయింది. సత్యప్రియ జైదేవ్ అనే పాత్రలో నయన్ ను పరిచయం చేసారు. ఇది ఒరిజినల్ వెర్షన్ లో మంజు వారియర్ చేసిన రోల్. ఇక జైదేవ్ గా స‌త్య‌దేవ్ ను చూపించారు. అయితే ఇది మాతృకలో ఏ పాత్ర అనేది క్లారిటీ రావడం లేదు.

లూసిఫర్ లో మంజు వారియర్ భర్త విలన్ గా కనిపిస్తాడు. ఆ పాత్రను బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చేసాడు. ఆమె సోదరుడిగా టొవినో థామ‌స్ నటించాడు. ఇప్పుడు 'గాడ్ ఫాదర్' లో నయన్ - సత్యదేవ్ పేర్లలో జైదేవ్ అని ఉండటంతో వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపిస్తారేమో.. సత్యదేవ్ విలన్ ఏమో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

అదే సమయంలో తండ్రి పేరు పిల్లలు కూడా తగిలించుకుంటారు కాబట్టి.. ఇద్దరూ అక్కా తమ్ముళ్ళుగా చేశారమో అనే డౌట్స్ ఉన్నాయి. దీంతో అసలు ప్రతినాయకుడు ఎవరనేది అంతుబ‌ట్ట‌కుండా ఉంది. ఒకవేళ సత్యదేవ్ విలన్ అంటే.. చిరంజీవికి ధీటుగా నిలబడటం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సత్యదేవ్ తో ఫైట్ చేయడానికి సల్మాన్ ఖాన్ ను దించాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ జనాల్లో వస్తుందని అంటున్నారు. ఇక స‌ముద్ర‌ఖ‌ని ఈ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చిన తర్వాత అత‌నే విల‌న్ అని అందరూ అనుకున్నారు. కానీ టీజ‌ర్ లో ఆయన్ని పోలీస్‌ గా చూపించారు. అందుకే గాడ్ ఫాదర్ లో నెగెటివ్ రోల్ లో ఎవరు కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

అయితే 'లూసిఫర్' డైరెక్టర్, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరుడు ఇంద్రజిత్ సుకుమారన్ 'గాడ్ ఫాదర్' సినిమాలో నటిస్తున్నట్లు టాక్ ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే అతన్ని విలన్ గా చూపిస్తారా అనే సందేహాలు కలగకమానవు. ట్రైలర్ తో ఈ సస్పెన్స్ వీడుతుందేమో చూడాలి.

కాగా, 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సురేఖ సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్‌బి చౌదరి మరియు ఎన్‌వి ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగుతో పాటుగా హిందీలోనూ రిలీజ్ చేయనున్నారని సమాచారం. 'ఆచార్య' వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.