Begin typing your search above and press return to search.

‘ఊపిరి’ చూశారు.. అరెస్టయ్యారు

By:  Tupaki Desk   |   4 April 2016 6:31 AM GMT
‘ఊపిరి’ చూశారు.. అరెస్టయ్యారు
X
సినిమా చూసినందుకు అరెస్టవ్వడమేంటి అనిపిస్తోందా? కానీ ఇది వాస్తవం. అలాగని వాళ్లేమీ పైరసీలో ఆ సినిమా చూడలేదు. థియేటరుకే వెళ్లారు. కాకపోతే టికెట్లు లేకుండా థియేటర్లోకి చొరబడి సినిమా చూసినందుకు పోలీస్ స్టేషన్ లో ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. ఇదంతా జరిగింది అమెరికాలో కావడం విశేషం. టెక్సాస్‌ లో ‘ఊపిరి’ ఆడుతున్న ఓ థియేటర్లలోకి కొందరు తెలుగు విద్యార్థులు టికెట్లు లేకుండా చొరబడ్డారట. గుట్టుచప్పుడు కాకుండా సినిమా చూస్తుండగా.. థియేటర్ సిబ్బందికి అనుమానం వచ్చి వారిని చెక్ చేయగా టికెట్లు కొనలేదని తేలింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు థియేటర్ సిబ్బంది.

పోలీసులొచ్చి ఆ విద్యార్థులందరినీ అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారట. తర్వాత వారికి జరిమానా వేసి.. వార్నింగ్ ఇచ్చి వదిలి పెట్టారట. దీనిపై కేసు నమోదైంది లేనిది తెలియడం లేదు. ఈ సంఘటన ఆ విద్యార్థులు చదివే యూనివర్శిటీలో పెద్ద చర్చనీయాంశంగా మారిందట. అమెరికాలో తెలుగు విద్యార్థులు ఇలా టికెట్లు లేకుండా థియేటర్లలోకి జొరబడి సినిమాలు చూడటం ఈ మధ్య తరచుగా జరుగుతోందట. ఈ సంగతి కొన్ని రోజులుగా గమనిస్తున్న థియేటర్ యాజమాన్యాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాళ్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా ‘ఊపిరి’ సినిమా ప్రస్తుతం అమెరికాలో అదరగొడుతోంది. ఆ సినిమా రెండో వీకెండ్లోనే ఒకటిన్నర మిలియన్ డాలర్ల మార్కుకు చేరువగా రావడం విశేషం.