Begin typing your search above and press return to search.

విదేశాల్లోని ఇండియన్స్ ఆతృత... ఏవియేషన్ సైట్ క్రాష్

By:  Tupaki Desk   |   6 May 2020 9:20 PM IST
విదేశాల్లోని ఇండియన్స్ ఆతృత... ఏవియేషన్ సైట్ క్రాష్
X
ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎక్కడి వారక్కడ చిక్కుకుపోయారు. ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ విమన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. అయితే భారత్ లో ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ కు కాస్తంత సడలింపులు దక్కిన నేపథ్యంలో... వలస కార్మికులను ఇళ్లకు చేరుస్తున్న మాదిరే... విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కూడా దేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా ప్రకటించింది. ఈ ప్రకటన విదేశాల్లోని మనోళ్లలో సరికొత్త ఆశలను రేపగా... ఆ ఆశలు కాస్తా ఆతృతగా మారిపోవడంతో పౌర విమానయాన శాఖకు చెందిన వెబ్ సైట్ ఏకంగా క్రాష్ అయిపోయింది. ఈ విషయాన్ని కేంద్రమే వెల్లడించడంతో పాటు విదేశాల్లోని మనోళ్లను తిరిగి దేశానికి రప్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చింది.

విదేశాల్లోని భారతీయులను దేశానికి రప్పించేందుకు ఈ నెల 7 నుంచి 13 వరకు ఏకంగా 64 ప్రత్యేక విమానాలను నడపనున్నట్లుగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు దేశం చేరదామా? అంటూ ఎదురు చూస్తూ తమది కాని దేశంలో బిక్కుబిక్కుమంటున్న భారతీయులు ఒక్కసారిగా ఎగబడ్డారు. విమాన టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి? ఎప్పుడు సర్వీసులు ప్రారంభమవుతాయి? తామెలా దేశం చేరుకోవాలి? అంటూ తమలో నెలకొన్న సందేహాలను తీర్చుకునేందుకు వారంతా ఎగబడ్డారు. దీంతో ఏవియేషన్ శాఖకు చెందిన వెబ్ సైట్ క్రాష్ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఏవియేషన్ శాఖ... వెబ్ సైట్ క్రాష్ అయిన వైనానికి చింతిస్తున్నామని, త్వరలోనే వెబ్ సైట్ ను సరిదిద్దుతామని కూడా ప్రకటించింది.

ఇక విదేశాల్లో చిక్కుకున్న మనోళ్లంతా తిరిగి వచ్చేందుకు చేసిన ఏర్పాట్లను వివరించిన కేంద్రం... టికెట్లను ఎయిర్ ఇండియా వెబ్ సైట్లోనే బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. కేంద్రం నుంచి వెలువడ్డ ఈ నిర్ణయం ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థలకు కాస్తంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. కేంద్రం నుంచి పిలుపు రాగానే రంగంలోకి దిగేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే... విదేశాల్లోని మనోళ్లను దేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం నడపనున్న 64 విమాన సర్వీసుల్లో 10 విమానాలు యూఏఈకి, రెండు ఖతార్ కు, ఐదు సౌదీ అరేబియాకు, ఏడు బ్రిటన్ కు, ఐదు సింగపూర్ కు, ఏడు అమెరికాకు, ఐదు పిలిప్పీన్స్ కు, ఏడు బంగ్లాదేశ్ కు వెళ్లనున్నాయి. ఇక విదేశాల నుంచి మనోళ్లను ఎక్కించుకుని వచ్చే విమానాల్లో 15 విమానాలు కేరళకు, 11 ఢిల్లీకి, మూడు కాశ్మీర్ కు, లక్నోకు ఒక సర్వీసు రానున్నాయి. ఇదిలా ఉంటే... విదేశాల నుంచి 64 విమానాల్లో దేశానికి వచ్చేవారంతా 14 రోజుల పాటు క్వారంటైన్ నిబంధనకు కట్టుబడి ఉండక తప్పదని కూడా కేంద్రం ప్రకటించింది.