Begin typing your search above and press return to search.

ఇండియన్‌ 2 కథ కంచికి.. మరి ఆ రూ.180 కోట్లు?

By:  Tupaki Desk   |   20 April 2021 4:36 AM GMT
ఇండియన్‌ 2 కథ కంచికి.. మరి ఆ రూ.180 కోట్లు?
X
యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ భారతీయుడు సినిమా సూపర్‌ హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వెల్‌ గురించి చాలా కాలంగా వార్తలు వచ్చాయి. శంకర్‌ మరియు కమల్‌ హాసన్ లు సీక్వెల్‌ కు సిద్దం అవ్వడంతో లైకా ప్రొడక్షన్స్ వారు దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ తో ఆ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సినిమా చిత్రీకరణ ఆరంభం అయినప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి వచ్చింది. సెట్‌ నిర్మాణంలో అసంతృప్తి వల్ల మళ్లీ సెట్టింగ్‌ ను పునర్‌ నిర్మించడం జరిగింది. కమల్ హాసన్‌ రాజకీయాలతో బిజీగా ఉండటం ఇతరత్ర కారణాల వల్ల ఆలస్యంగా ఇండియన్ 2 షూటింగ్‌ జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో సెట్‌ లో క్రేన్‌ యాక్సిడెంట్‌ జరిగి షూటింగ్‌ పూర్తిగా ఆగిపోయింది.

క్రేన్‌ యాక్సిడెంట్‌ సమయంలో నిర్మాతలు వ్యవహరించిన తీరు కమల్‌ హాసన్‌ కు కోపం కలిగించింది. బాధితులకు సాయం చేసేందుకు లైకా ప్రొడక్షన్స్‌ ముందుకు రాకపోవడంతో పాటు వారి స్పందన సరిగా లేదంటూ కమల్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ వ్యవహారం సర్ధుమనిగి మళ్లీ షూటింగ్‌ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకుంటూ ఉండగా అనూహ్యంగా కరోనా వచ్చింది. కరోనా కారణంగా సినిమా పట్టాలెక్కలేదు. ఆ వెంటనే కమల్ తమిళనాడు రాజకీయాలతో బిజీ అయ్యాడు. ఇండియన్ 2 సినిమా కోసం ఇంకా ఎంత కాలం తన సమయం ను వృదా చేసుకోవాలంటూ శంకర్‌ కొత్త సినిమాను రామ్‌ చరణ్‌ తో దిల్‌ రాజు బ్యానర్‌ లో మొదలు పెట్టాడు.

శంకర్ కొత్త సినిమా మొదలు పెట్టిన వెంటనే లైకా ప్రొడక్షన్స్ వారు తమ సినిమా పూర్తి కాకుండానే కొత్త సినిమాను శంకర్ మొదలు పెట్టాడంటూ కోర్టుకు వెళ్లారు. అక్కడ శంకర్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. గత కొంత కాలంగా లైకా ప్రొడక్షన్స్ వారిని శంకర్‌ ఇండియన్ 2 మొదలు పెట్టండి అంటూ కోరడం జరిగింది. కాని వారి నుండి రెస్పాన్స్ రాలేదు. రెండేళ్ల తన విలువైన సమయం వృదా అవ్వడం జరిగిందని శంకర్ కోర్టులో పేర్కొన్నాడు. దాంతో శంకర్‌ మరో సినిమా చేయడం ను తప్పుబట్టలేమని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. లైకా వారి అలసత్వం వల్లే సినిమా ఆగిపోయిందని శంకర్ ది తప్పేం లేదు అన్నట్లుగా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే ఇండియన్ 2 సినిమా విషయంలో శంకర్ ను బాధ్యుడిగా చేయలేం అంటూ కోర్టు పేర్కొంది.

ఈ మొత్తం వ్యవహారంతో ఇండియన్ 2 కథ ముగిసిందనిపిస్తుంది. ఇప్పటి వరకు లైకా వారు ఏకంగా రూ.180 కోట్ల ను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఆ మొత్తం ను లైకా వారు ఎలా రికవరీ చేసుకోవాలి అనేది కొందరు నిర్మాతల ప్రశ్న. ఈ సమస్యను మద్య వర్తుల ద్వారా పరిష్కరించుకుని సినిమా ను మళ్లీ మొదలు పెట్టి లైకా వారు పెట్టిన మొత్తంకు న్యాయం చేయాలని ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమల్‌ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఏమైనా ఫలితం ఉండే అవకాశం ఉందంటున్నారు. కాని ఆయన లైకా వారి విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నారట. అందుకే ఇండియన్ 2 మళ్లీ ప్రారంభం అయ్యే విషయమై ఎలాంటి స్పష్టత లేదంటున్నారు.