Begin typing your search above and press return to search.

ఓవ‌రాల్ గా టిక్కెట్టు లంప‌టం అంత ప‌ని చేసింది!

By:  Tupaki Desk   |   12 July 2021 10:00 PM IST
ఓవ‌రాల్ గా టిక్కెట్టు లంప‌టం అంత ప‌ని చేసింది!
X
ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపు జీవో పొరుగు రాష్ట్రంలోనూ ప్ర‌కంప‌నాల‌కు తెర తీసిన సంగ‌తి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే టిక్కెట్టు ధ‌ర అమ‌ల్లో ఉండాల‌నే ప్ర‌తిపాద‌న‌ను తెచ్చారు సినీపెద్ద‌లు. తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. అలాగే ఎగ్జిబిష‌న్ రంగాన్ని కాపాడేందుకు తెలుగు ప్ర‌భుత్వాలు త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని తెలంగాణ ఛాంబ‌ర్ కోరింది.

ఇదిలా ఉంటే ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల జీవోని స‌వ‌రించే విష‌య‌మై ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. దీంతో ప‌లువురు సినీపెద్ద‌లు స‌ర్కార్ వ‌ద్ద కొత్త ప్ర‌తిపాద‌న తెచ్చార‌ని తెలిసింది. ఇన్నాళ్లు ఇష్టానుసారం టిక్కెట్టు ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దానికి చెక్ పెట్టేసిన ప్ర‌భుత్వంతో కొత్త ప్ర‌తిపాద‌న తెచ్చారు. నిజానికి శుక్ర‌- శ‌ని- ఆదివారాల్లో థియేట‌ర్ల‌లో ర‌ద్దీ ఎక్కువ ఉంటుంది. వీకెండ్స్ సినిమాలు బాగా ఆడతాయి క‌నుక ఆ ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని టిక్కెట్టు ధ‌ర‌లు పెంచుతార‌ట‌. ఇక మంగ‌ళ‌- బుధ‌ వారాల్లో ఒక టిక్కెట్టు కొంటే ఇంకొక‌టి ఫ్రీ త‌ర‌హా ఆఫ‌ర్లు అమ‌ల్లోకి తెస్తారు. బుధ‌వారం రెండు టిక్కెట్లు ఫ్రీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంద‌ట‌. ఇత‌ర రోజుల్లో ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ఫిక్స్ డ్ ధ‌ర‌ల‌తోనే టిక్కెట్లు అమ్మాల్సి ఉంటుంది. ఈ త‌ర‌హా విధానం బెంగ‌ళూరు క‌ర్నాట‌క స‌హా పొరుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే అమ‌ల్లో ఉంది. దానిని ఇప్పుడు ఏపీకి తెలంగాణ‌కు అప్ల‌య్ చేసే ఆలోచ‌న ఉంద‌ని స‌మాచారం. ఏపీలో హోంశాఖ ఉత్త‌ర్వు జారీ అయ్యింది.

నిజానికి ఏదైనా పెద్ద సినిమా రిలీజైన‌ప్పుడు తొలి రెండు వారాలు టిక్కెట్టు ధ‌ర ఇష్టానుసారం పెంచుకునే వెసులుబాటు ఇంత‌కుముందు ఎగ్జిబిట‌ర్ కి ఉండేది. ప్ర‌భుత్వాల‌తో ప‌ని లేకుండా కోర్టుకు వెళ్లి అనుమ‌తులు తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడ‌లా లేదు. దీనిపై అప్ప‌టిక‌ప్పుడు స‌ర్కార్ అనుమ‌తించే వీలుంద‌ని తెలిసింది. అంటే ఓవ‌రాల్ గా సినిమా టిక్కెట్టు రేటు పెంచుకోవాలంటే ఏపీ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించాల్సిందే. ఎవ‌రికి అనుమ‌తులు ఇవ్వాలి? ఎవ‌రికి ఇవ్వ‌కూడ‌దు? అన్న‌ది ప్ర‌భుత్వ‌మే నిర్ణయిస్తుంద‌న్న‌మాట‌.

మొత్తానికి ర‌ద్దీని డిమాండ్ ని బ‌ట్టి టిక్కెట్టు ధ‌ర‌ను ఫిక్స్ చేస్తున్నారు. ఇది కొత్త విధానం.. దీనిని క్లాస్ వెంట‌నే క్యాచ్ చేసినా.. మాస్ అర్థం చేసుకునేందుకు కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చు. అలాగే ఆన్ లైన్ టికెటింగ్ వ్య‌వ‌స్థ ప్ర‌భుత్వం చెంత‌నే ఉంటుందా.. లేక దానిని ప్ర‌యివేటుకు బ‌ద‌లాయిస్తారా? అన్న‌దానిపైనా క్లారిటీ రావాల్సి ఉంటుంది.

టిక్కెట్టు ధ‌ర‌ల పెంపు అంశంపై ప‌రిశ్ర‌మ‌కు పూర్తి క్లారిటీ వ‌చ్చే వ‌ర‌కూ ఏదీ తేలేట్టు లేదు. దీనిపై సంపూర్ణ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని ఛాంబ‌ర్ పెద్ద‌లే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక సినీపెద్ద ఎన్వీ ప్ర‌సాద్ వంటి వారు ఏపీ ప్ర‌భుత్వంతో మంతనాలు సాగించేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నార‌ని ఆయ‌న త్వ‌ర‌లోనే జ‌గ‌న్ ని క‌లుస్తున్నార‌ని కూడా టాక్ వినిపించింది.

టిక్కెట్టు ధ‌ర‌ల అంశంతో పాటు ఇంకా ఎగ్జిబిట‌ర్ల‌కు చాలా స‌మ‌స్య‌లున్నాయి. సెకండ్ వేవ్ స‌మ‌యంలో అన్ని థియేట‌ర్ల‌ను బంద్ చేశారు. వీటికి క‌రెంట్ బిల్లుల మాఫీ స‌హా జీఎస్టీ మిన‌హాయింపు వంటివి ప్ర‌భుత్వాల‌ను ఛాంబ‌ర్లు కోరుతున్నాయి. ఆస్తి ప‌న్ను చెల్లింపుల పైనా త‌గ్గింపుల‌ను కోరుతున్నారు. ఇవ‌న్నీ ప‌రిష్కృతం అయితేనే మునుముందు థియేట‌ర్ల‌ను తెరుస్తార‌ట‌. అయితే స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే టాలీవుడ్ మ‌నుగ‌డ ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టేన‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఇప్ప‌టికిప్పుడు రిలీజ్ కోసం వెయిటింగులో ఉన్న చాలా సినిమాల ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది అర్థం కాని గంద‌ర‌గోళంగా ఉంది. ఇక ఇటీవ‌లే నారప్ప చిత్రాన్ని థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం సిద్ధం చేస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చిన వెంట‌నే తిరిగి ఓటీటీకే సురేష్ బాబు మొగ్గు చూపుతున్నార‌న్న ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. నిజానికి ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకున్నార‌ని ప్ర‌చార‌మ‌య్యాక ఈ మార్పు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నిజంగా పెద్ద క‌న్ఫ్యూజన్ కి కార‌ణ‌మైంది. ఏపీలో టిక్కెట్టు వ్య‌వ‌హారం ఇప్ప‌ట్లో తేల‌ద‌ని భావించాకే సురేష్ బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నారా? ఆయ‌న కాంపౌండ్ సినిమాల‌న్నిటినీ ఓటీటీల‌కే ఇచ్చేయాల‌న్న నిర్ణ‌యం వెన‌క అస‌లు కార‌ణం ఏమై ఉంటుంది? ఇలా ఎన్నో సందిగ్ధ‌త‌లు వెంటాడుతున్నాయి. ఓవ‌రాల్ గా టిక్కెట్టు లంప‌టం ఈ రేంజులో ప‌ని చేస్తోంద‌న్న‌మాట‌!!