Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: బోల్డ్ అండ్ థ్రిల్లింగ్ గా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’

By:  Tupaki Desk   |   12 Jun 2021 5:30 AM GMT
ట్రైలర్ టాక్: బోల్డ్ అండ్ థ్రిల్లింగ్ గా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’
X
కమెడియన్ ప్రియదర్శి - నందినీ రాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ఐ.ఎన్.జి). దీనికి విద్యాసాగర్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించారు. 'బాషా' చిత్రాన్ని తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ ఈ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 18 నుండి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ చర్చనీయాంశం అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ట్రైలర్ ను కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

'అరేయ్.. నీకు సైతాన్ కి దేవుడుకి తేడా ఏంటో తెలుసా?' అంటూ ప్రియదర్శి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారభమైంది. 'సైతాన్ నీలోని కోరికను రెచ్చగొట్టి, నువ్వు తప్పు చేసేలా చేసి, నువ్ కష్టపడుతుంటే చూసి ఆనందిస్తాడు.. కానీ దేవుడు మాత్రం నువ్వు తప్పు చేస్తే పుటుక్కున చంపేస్తాడు' అని చెప్పడంతో ప్రేమ - దురాశ - కామం - ప్రతీకారం - పవర్ వంటి అంశాలతో ఈ సిరీస్ ని రూపొందించినట్లు హింట్ ఇచ్చారు. ఇందులో రొమాంటిక్ పాళ్లు కాస్త ఎక్కుకే అని ట్రైలర్ లోనే తెలుస్తుంది. నందినీ రాయ్ - ప్రియదర్శి మధ్య సన్నివేశాలు.. నందినీ రాయ్ లిప్ లాక్ సీన్స్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచాయి.

అనుకోని పరిస్థితుల్లో నేర ప్రపంచంలోకి ప్రవేశించిన ప్రియదర్శిని కొందరు వెంటాడటం.. అతను వాళ్ళ మీద తిరగబడటం వంటి సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. కామెడీ రోల్స్ తో నవ్విస్తూ వస్తున్న ప్రియదర్శి మరో విలక్షణమైన పాత్రలో నటించినట్లు అర్థం అవుతోంది. 'ఈ రోజు నువ్వు నా పెళ్ళాన్ని చూస్తే, రేపు ఇంకొకడు నీ పెళ్ళాన్ని చూస్తాడు.. ఇది సృష్టి ధర్మం రాజా' అంటూ పోసాని కృష్ణ మురళి చెప్పే డైలాగ్ తో ఇందులో లస్ట్ గురించి ప్రధానంగా చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. ఉత్కంఠ భరితంగా సాగిన 'ఐ.ఎన్.జి' ట్రైలర్ బోల్డ్ గా థ్రిల్లింగ్ గా ఉంది.

సురేష్ కృష్ణ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. దీనికి వరుణ్ డీకే సినిమాటోగ్రఫీ అందించగా.. నిఖిల్ శ్రీకుమార్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అలెగ్జాండర్ సంగీతం సమకూరుస్తున్నారు. 'ఆహా' లో ఈ నెల 18న రాబోతున్న ''ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్'' (ఐ.ఎన్.జి) సిరీస్ ఏ మేరకు ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.