Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం అంత ప్లాన్ చేస్తే..

By:  Tupaki Desk   |   3 Sep 2022 9:30 AM GMT
ఎన్టీఆర్ కోసం అంత ప్లాన్ చేస్తే..
X
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు.. అలాగే 'బ్రహ్మాస్త్ర' టీంకు శుక్రవారం సాయంత్రం పెద్ద షాకే తగిలింది. 'బ్రహ్మాస్త్ర' తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చాలా పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేయగా.. మొత్తం కష్టాన్ని వృథా చేస్తూ ఆ ఈవెంట్‌ రద్దయిపోయింది. రామోజీ ఫిలిం సిటీలో చాలా పెద్ద మైదానంలో ఘనంగా ఈ ఈవెంట్ కోసం సన్నాహాలు చేశారు. వేదిక కోసం కట్టిన అద్దె, అక్కడ చేసిన ఏర్పాట్లు అన్నింటికీ కలిపి దాదాపు రూ.2 కోట్ల దాకా ఖర్చు అయినట్లు సమాచారం.

ఈ ఈవెంట్ కోసం ముందే అన్ని అనుమతులూ తీసుకున్నా సరే.. ఇంకొన్ని గంటల్లో వేడుక జరగాల్సి ఉన్న సమయంలో పోలీసులు ఈవెంట్‌ను రద్దు చేయించారు. దీంతో అప్పటికప్పుడు ఏం చేయాలో పాలుపోక అయోమయానికి గురైన నిర్వాహకులు.. కొన్ని గంటల్లోనే పార్క్ హయత్ హోటల్లో చిత్ర బృందంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఉన్నంతలో ఆ ఈవెంట్‌ను బాగానే మేనేజ్ చేసినప్పటికీ.. ముందు ప్లాన్ చేసినట్లు బహిరంగ వేదికలో ఘనంగా ఈ ఈవెంట్ జరుపుకోలేకపోయినందుకు చిత్ర బృందం.. ఎన్టీఆర్‌ను చూడలేకపోయినందుకు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇది బాలీవుడ్ మూవీనే అయినప్పటికీ..

తెలుగు సినిమాలకు చేసినట్లు చాలా పెద్ద స్థాయిలో ఈవెంట్ కోసం సన్నాహాలు జరిగాయి. బహుశా ఒక హిందీ చిత్రానికి ఇలాంటి ఈవెంట్ ఇప్పటిదాకా జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు. బడ్జెట్‌ను బట్టే దీని రేంజ్ అర్థం చేసుకోవచ్చు. తారక్, రాజమౌళి, నాగార్జున, రణబీర్ కపూర్, ఆలియాభట్, కరణ్ జోహార్ లాంటి మహామహుల్ని ఒక బహిరంగ వేదిక మీద చూస్తే ఆ కిక్కే వేరుగా ఉండేది. పైగా ఈ ఈవెంట్‌‌లో తారక్‌కు ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చేలా ప్లానింగ్ జరిగినట్లు రాజమౌళి స్వయంగా వెల్లడించడం విశేషం.

రణబీర్ తెలుగులో "తొడగొట్టు చిన్నా" అని డైలాగ్ చెబితే.. తారక్ బదులుగా వేదిక మీది నుంచి తొడగొట్టేటలా ప్లాన్ చేశామని.. ఇదంతా తాను అభిమానుల మధ్య కూర్చుని చూడాలని చాలా ఎగ్జైట్మెంట్‌తో ఉన్నానని.. దురదృష్టవశాత్తూ ఈవెంట్ రద్దయిందని రాజమౌళి ప్రెస్ మీట్లో చెప్పడం విశేషం. ఈ మాట విన్నాక ఆ ఎలివేషన్ ఊహించుకుని తారక్ అభిమానులు ఈవెంట్ రద్దయినందుకు మరింత బాధపడుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.