Begin typing your search above and press return to search.

సౌత్ లో ప్లాప్ అయితే.. నార్త్ లో గ్రాండ్ సక్సెస్ ఖాయమా?

By:  Tupaki Desk   |   14 July 2021 3:30 AM GMT
సౌత్ లో ప్లాప్ అయితే.. నార్త్ లో గ్రాండ్ సక్సెస్ ఖాయమా?
X
సాధారణంగా హీరోయిన్ల మీద ప్లాప్ ముద్ర పడితే అంతకు మించిన ఇబ్బంది మరొకటి ఉండదు. నిజానికి కమర్షియల్ మూవీస్ లో హీరోయిన్ల పాత్ర పరిమితం. ఆ మాటకు వస్తే.. గ్లామర్ షోకు అవసరమైన షో పీస్ ల మాదిరి హీరోయిన్లను వాడటమే కాదు.. బలమైన పాత్రలు ఇచ్చి.. వారి నటనతో ప్రేక్షకుల మదిని దోచుకునేలా చేయటంపై దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించని వైనం కనిపిస్తుంది. ఈ కారణంతోనే.. హీరోయిన్లు అన్నంతనే గ్లామర్ షో మాత్రమే గుర్తుకు వస్తాయే తప్పించి.. వారి నటన గుర్తుకు రాదు. అందం.. అంతకు మించిన అభినయంతో గుర్తింపు పొందినోళ్లు చాలా తక్కువ మందే అన్న విషయం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సౌత్ లో ఎంట్రీ ఇచ్చి.. వారు చేసిన సినిమాలు ప్లాఫ్ అయ్యాక.. బాలీవుడ్ లోకి అడుగు పెట్టి సక్సెస్ అయిన నటీమణుల సంఖ్య కాస్త ఎక్కువే. సాధారణంగా నార్త్ లో సక్సెస్ అయి.. సౌత్ కు వచ్చేటోళ్లు ఉంటారు. ఇటీవల కాలంలో సౌత్ లో ప్లాప్ షాక్ తగిలి.. విలవిలలాడుతూ బాలీవుడ్ కు వెళ్లి అవకాశాల్ని చేజిక్కించుకోవటమే కాదు.. తిరుగులేని స్థానాలకు చేరుకోవటం కనిపిస్తుంది. ఇరువర్ తర్వాత తమిళ.. తెలుగు సినిమాల్ని చేసిన ఐశ్వర్యా.. అప్పుడప్పుడే విజయాన్ని సొంతం చేసుకున్నా.. ఆమె ఫోకస్ అంతా బాలీవుడ్ మీద ఉండటం.. అందుకు తగ్గట్లే సక్సెస్ కావటం తెలిసిందే.

ఇదే తీరులో చాలామంది హీరోయిన్లు కనిపిస్తారు. ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలేసిన ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ను చూస్తే.. ఆమె కెరీర్ మొదలైంది మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువన్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంతలా పల్టీ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతోనిరాశకు గురైన ఐశ్వర్య తదనంతరం బాలీవుడ్ కు వెళ్లటం.. అక్కడ తిరుగులేని సక్సెస్ లను సొంతం చేసుకోవటం తెలిసిందే. ఇదే బాటలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా వస్తారు. వెంకటేశ్ తో మల్లీశ్వరి మూవీతో జత కట్టిన ఆమె.. తర్వాత బాల‌కృష్ణ‌తో ఒక సినిమా చేసినా అదీ ప్లాప్.. అనంతరం బాలీవుడ్ కు వెళ్లిన ఆమె.. తిరుగులేని హీరోయిన్ మారారు.

వీరిద్దరి మాదిరే బాలీవుడ్ ను మాత్రమే కాదు.. హాలీవుడ్ లోనూ తన సత్తా చాటిన ప్రియాంక చోప్రా సైతం సౌత్ నుంచే తన సినీ జర్నీని షురూ చేశారు. 2002లో విజయ్ హీరోగా నటించిన తమిళన్ మూవీతో ప్రియాంక హీరోయిన్ గా మారారు. అదే ఏడాది బాలీవుడ్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆమె.. అక్కడే సెటిల్ అయిపోయారు. కాలక్రమంలో హాలీవుడ్ లో సెటిల్ కావటమే కాదు.. అక్కడి సెలబ్రిటీని ప్రేమించి పెళ్లాడటం తెలిసిందే.

వీరి మాదిరే.. దీపికా పదుకునే సైతం తన తొలిసినిమా కన్నడలో ఉపేంద్ర సరసన నటించారు. తెలుగు సక్సెస్ అయిన మన్మధుడికి కన్నడ రీమేక్. ఈ మూవీ హిట్ అయినప్పటికి ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో.. ఆమె బాలీవుడ్ కు షిఫ్ట్ కావటం.. సక్సెస్ కావటం తెలిసిందే. విలక్షణ నటిగా.. గ్లామర్ కంటే గ్రామర్ ఉన్న హీరోయిన్ గా పేరును సొంతం చేసుకున్న తాప్సీ కథ కూడా ఈ కోవకు చెందిందే.

ఆమెను గ్లామర్ డాల్ గా సౌత్ చూసినా.. ప్రేక్షకులు మాత్రం ఆమెకు పట్టం కట్టలేదు. దీంతో బాలీవుడ్ కు షిఫ్టు అయిన ఆమె.. అక్కడ తానేమిటో ఫ్రూవ్ చేసుకోవటమే కాదు.. అదే క్రమంలో సౌత్ లోనూ ఆమెకు అభిమానుల్ని తెచ్చి పెట్టింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. బోలెడంత మంది హీరోయిన్లు ఇలానే చేయటం కనిపిస్తుంది. మొత్తంగా సౌత్ షాకిస్తే.. నార్త్ వారిని స్టార్లను చేసిందని చెప్పక తప్పదు.