Begin typing your search above and press return to search.

రౌడీ బ్రాండ్ కి ఐక‌న్ స్టార్ ప్ర‌చారం..!

By:  Tupaki Desk   |   18 Dec 2021 8:30 AM GMT
రౌడీ బ్రాండ్ కి ఐక‌న్ స్టార్ ప్ర‌చారం..!
X
విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ బ్రాండ్ పేరుతో వ‌స్త్ర‌ వ్యాపారంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. రౌడీ బ్రాండ్ ప్ర‌చారంలోనూ అత‌డు ఎప్పుడూ క్రియేటివ్ గానే ఆలోచిస్తున్నాడు. దుస్తుల్ని త‌న ఫేవరెట్ల‌కు బ‌హుమ‌తులుగా పంపించ‌డం విజయ్ కి అల‌వాటు. వీళ్ల‌లో ఎక్కువ‌గా విజ‌య్ నుంచి బ‌న్నీ వ‌రుస‌గా గిప్ట్ ప్యాక్ లు అందుకున్నారు.

`అల‌వైంకుఠ‌పుర‌ములో` రిలీజ్ అనంత‌రం బ‌న్నీ కోసం ఖ‌రీదైన రౌడీ వేర్ దుస్తుల్ని పంపించాడు. వాటిని సినిమా స‌క్సెస్ మీట్ కి వేసుకుని వ‌స్తాన‌ని బ‌న్నీ ప్రామిస్ చేసాడు. ఇచ్చిన మాట ప్ర‌కారం `అల వైకుంఠ‌పుర‌ములో` పెద్ద స‌క్సెస్ అవ్వ‌డం...స‌క్సెస్ మీట్ కి ఆ దుస్తుల్ని ధ‌రించి రావ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

స్టైలిష్ స్టార్ ప్ర‌చారం పుణ్య‌మా అని రౌడీ బ్రాండ్ మార్కెట్ లో క్రేజీ బ్రాండ్ గా మారిపోయింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప- ది రైజ్` శుక్ర‌వారం రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

సినిమాకు టాక్ ఎలా ఉన్నా ఆరంభ వ‌సూళ్లు బావున్నాయి. హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి త‌న రౌడీ బ్రాండ్ దుస్తుల్ని బ‌న్నీకి గిప్ట్ గా పంపించాడు.

దీంతో బ‌న్నీ స‌ర్ ప్రైజ్ ఫీల్ అయ్యాడు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి సోష‌ల్ మీడియా వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. అయితే ఈ దుస్తుల్ని ఎప్పుడు ధ‌రిస్తాడు? అన్న విష‌యాన్ని మాత్రం బ‌న్నీ రివీల్ చేయలేదు. `పుష్ప- ది రైజ్` స‌క్సెస్ వేడుక‌లో మ‌ళ్లీ ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

ఏది ఏమైనా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఫేవ‌రెట్ స్టార్ తో కావాల్సినంత ప్ర‌చారం చేయించుకుంటున్నాడు. వ‌స్త్ర‌ వ్యాపారాన్ని మార్కెట్ చేసుకోవ‌డానికి స‌రైన స్ట్రాట‌జీతోనే ముందుకు వెళుతున్నాడు. ఓ సెల‌బ్రిటీని బ్రాండ్ అంబాడిస‌ర్ గా చేసుకుని ప్ర‌మోట్ చేయాలంటే కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంది.

అలా కాకుండా మార్కెట్ లో త‌న‌కున్న పేరు.. ప‌లుకుబ‌డిని.. ప‌రిచ‌యాల్ని తెలివిగా వినియోగించుకుంటూ రౌడీ బ్రాండ్ ని మార్కెట్ లో కి ఎక్కిస్తున్నాడు. ఇది తెలివైన బిజినెస్ మ్యాన్ ప‌నే అన్న గుస‌గుస ఉంది. అయితే విజ‌య్ మాత్రం బ‌న్నీపై అభిమానంతోనే ఇలా కానుక‌ల్ని పంపిస్తాడ‌ని కూడా త‌న అభిమానులు చెబుతారు.

బ‌న్ని-విజ‌య్ మ‌ల్టీస్టార‌ర్ ఎపుడు?

మ‌రోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తే బావుంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. అన్నా అంటూ బ‌న్నీని ఎంతో ఆప్యాయంగా పిలిచే విజ‌య్ ని బ‌న్ని కూడా సొంత త‌మ్ముడిలా అభిమానిస్తాడు. అందువ‌ల్ల ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ తో ఏదైనా సినిమా వ‌స్తుందేమో చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో ఉంది.

వ‌రుస‌గా మ‌ల్టీస్టార‌ర్లు టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్నాయి. ప్ర‌భాస్ - రానా క‌లిసి న‌టించారు. చ‌ర‌ణ్ - తార‌క్ క‌లిసి న‌టిస్తున్నారు. అడివి శేష్.. కార్తికేయ‌.. సుశాంత్ లాంటి హీరోలు అగ్ర హీరోల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్లు చేస్తున్నారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా అదే బాట‌లో అగ్ర హీరోల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్లు చేస్తాడేమో చూడాలి.