Begin typing your search above and press return to search.

సినీ ర‌చ‌యిత‌ల‌కు పెద్ద‌ భ‌రోసా!

By:  Tupaki Desk   |   24 Oct 2018 4:49 AM GMT
సినీ ర‌చ‌యిత‌ల‌కు పెద్ద‌ భ‌రోసా!
X
ఫ‌లానా స్టార్ డైరెక్ట‌ర్ `నా క‌థ కొట్టేశాడ‌ని` - లేదూ ఫ‌లానా సీన్ కొట్టేశాడ‌ని - ఐడియా వాడేసుకున్నాడ‌ని ఫిర్యాదులు ఇబ్బ‌డిముబ్బ‌డిగా అందుతూనే ఉన్నాయి. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఇది ఉంది. ఏ.ఆర్‌.మురుగ‌దాస్ - త్రివిక్ర‌మ్ అంత‌టి వారిపైనే ఈ త‌ర‌హా వివాదాలు ముసురుకున్నాయి. అయితే వీట‌న్నిటికీ చెక్ పెట్టే ఛాన్సే లేదా? అంటే ఈ పెద్దాయ‌న ఆన్స‌ర్ వినాల్సిందే.

కేవ‌లం ఐదే చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా దేశ వ్యాప్తంగా ఖ్యాతిని సొంతం చేసుకున్నారు రాజ్‌ కుమార్ హిరాణీ. ఆయ‌న నుంచి సినిమా అంటే సామాజిక సందేశం త‌ప్ప‌నిస‌రి. ఆహ్లాద‌క‌ర‌మైన‌ హాస్యాన్ని జోడించి సందేశాత్మ‌కంగా సినిమాని చూపించ‌డంలో అత‌డు ఘ‌నాపాటి. అలాంటి ద‌ర్శ‌కుడు ర‌చ‌యిత‌ల‌కు గౌర‌వాన్ని ఆపాదిస్తూ.. కొత్త డిమాండ్‌ ను తెర‌పైకి తీసుకొస్తున్నాడు. సినిమాకు మూలాధారం క‌థ‌. అది లేక‌పోతే సినిమా లేద‌ని - దాన్ని అందించే ర‌చ‌యిత‌ల‌కు స‌ముచిత ప్రాధాన్యత‌ వుండాల‌ని - వారికి త‌గిన పారితోషికం ఇచ్చి ప్రోత్స‌హించ‌కపోతే భ‌విష్య‌త్తులో మంచి క‌థ‌ల మాట దేవుడెరుగు.. అస‌లు క‌థ‌ల‌కే ఎస‌రొచ్చే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నాడు.

ప్ర‌తి సినిమాకు ర‌చ‌యితే పునాది. ఇప్పుడు మీ సినిమా కోసం ప‌నిచేసిన ర‌చ‌యిత‌కు స‌రైన పారితోషికం ఇవ్వ‌క‌పోతే ఇక‌పై మంచి ర‌చ‌యిత‌లు వెతికినా దొరికే అవ‌కాశం వుండ‌దు. ఇది భ‌విష్య‌త్తులో సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు పెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించే అవ‌కాశం వుంది. అందుకే త్వ‌ర‌గా తేరుకుని ప‌రిశ్ర‌మ‌ను బ్ర‌తికిస్తున్న ర‌చ‌యిత‌ను గౌర‌విద్దాం. మంచి పారితోషికాన్ని అందిద్దాం` అంటున్నారు రాజ్‌ కుమార్ హిరాణి.

నేను చిన్న న‌గ‌రం నుంచే వ‌చ్చాను. అక్క‌డి ర‌చ‌యిత‌లు రాసే ర‌చ‌న‌ల‌నే నేను ఎక్కువ‌గా న‌మ్ముతాను. వారికే జీవితంపై ఎక్కువ‌ అవ‌గాహ‌న వుంటుంది. అలాంటి వారి నుంచే అద్భుత‌మైన క‌థ‌లు పుట్టుకొస్తాయి. అందుకే అలాంటి వారినే ఎక్కువ‌గా ప్రోత్స‌హించండి అని చెబుతున్నారు. నిజ‌మే... అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనే అగ్ర‌ద‌ర్శ‌కులు - స్టార్ రైట‌ర్లు చిన్న స్థాయి ర‌చ‌యిత‌ల నుంచి ఐడియాలు కాపీ కొట్టేస్తూ.. చౌర్యం చేస్తుంటే క‌థ‌ల కొర‌త ఎందుకు రాదు హిరాణి. మీలాంటి ద‌ర్శ‌కులు ఈ విష‌యంలో న‌డుం బిగిస్తే రానున్న కాలం ర‌చ‌యిత‌దే. క‌థ‌లు కొట్టేయ‌డం అనే ఝాడ్యం నుంచి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్ని బ‌య‌ట‌ప‌డేసేందుకు ఇలాంటి పెద్ద స్థాయి డైరెక్ట‌ర్లు కృషి చేస్తే బావుంటుందేమో!