Begin typing your search above and press return to search.

అందుకే టాలీవుడ్ హీరోలంటే ఇష్టం: ప్రశాంత్ నీల్

By:  Tupaki Desk   |   20 April 2022 10:13 AM IST
అందుకే టాలీవుడ్ హీరోలంటే ఇష్టం: ప్రశాంత్ నీల్
X
ప్రశాంత్ నీల్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. భారీ సినిమాల దర్శకుల జాబితాలో ఆయన పేరు చేరిపోయింది. యాక్షన్ .. ఎమోషన్స్ ను తన సినిమాల్లో అద్భుతంగా ఆవిష్కరించగల దర్శకుడిగా ఆయన పేరును చెప్పుకుంటున్నారు. సాధారణంగా ఏ సినిమాకైనా హీరోలను బట్టే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తుంటారు. దర్శకులు ఎవరనేది చూసి థియేటర్స్ కి వెళ్లడమనేది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతూ వస్తోంది. అలాంటి దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్ పేరు కూడా చేరిపోయింది.

'కేజీఎఫ్' ..' కేజీఎఫ్ 2'ఈ రెండు సినిమాలు కూడా దర్శకుడిగా ఆయనను ఎవరెస్టు స్థాయిలో నిలబెట్టాయి. కన్నడ సినిమాల బడ్జెట్ .. కథలు .. విడుదల విషయంలో వాటి పరిథి చాలా తక్కువ అనుకున్నవారు ఆశ్చర్యపోయేలా ఆయన కన్నడ సినిమా స్థాయిని అమాంతంగా పెంచేశాడు. కన్నడ సినిమాను నేరుగా తీసుకుని వెళ్లి ప్రపంచపటానికి పరిచయం చేశాడు. దాంతో కన్నడ సీమలో ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాంటి వాళ్లంతా ఇప్పుడు ఆయన విషయంలో కాస్త అసంత్రిప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో ఆయన ఎన్టీఆర్ .. మహేశ్ బాబుల గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' చేస్తున్న ఆయన, ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ తో గానీ .. మహేశ్ తో గాని చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది.

కన్నడతో పోల్చుకుంటే తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దది. ఇక్కడ వచ్చే పేరు .. డబ్బు అంతకంటే రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అలాంటి ఒక ఆశతోనే ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్లకు దూరంగా.. టాలీవుడ్ స్టార్లకు దగ్గరగా ఉంటున్నాడని చెప్పుకుంటున్నారు.

ఈ విషయంపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ .. "కన్నడ ఇండస్ట్రీ అంటే నాకు చాలా గౌరవం .. ఆ ఇండస్ట్రీలో నేను ఒకడిని అయినందుకు గర్వపడుతుంటాను. నా సినిమా చూడగానే ముందుగా ఎన్టీఆర్ .. మహేశ్ బాబు స్పందించారు. కాల్ చేసి మరీ అభినందించారు.

ఇంటికి ఆహ్వానించి మరీ అభినందించారు. ఇలా ఒక డైరెక్టర్ తో మాట్లాడుతూనే, తమకి అతను ట్యూన్ అవుతాడా? ఆయనతో సినిమా చేయవచ్చునా? అనే ఒక అంచనాకి ఇక్కడి హీరోలు వస్తారు. అంతే తప్ప తమకి ఒక సినిమా చేసి పెట్టమని మాత్రం అడగరు. అలాంటి ఒక మర్యాద పూర్వకమైన తీరు నాకు నచ్చుతుంది. నా కథలను బట్టే నా హీరోలు ఉంటారు తప్ప, ఎవరినీ చిన్నబుచ్చడం నా అభిమతం కాదు" అని ఆయన చెప్పుకొచ్చారు.