Begin typing your search above and press return to search.

ఐతే షారుఖ్ ఇప్పుడేం చేస్తాడబ్బా

By:  Tupaki Desk   |   21 Sep 2016 7:30 PM GMT
ఐతే షారుఖ్ ఇప్పుడేం చేస్తాడబ్బా
X
మొన్నే క్రిష్ సిరీస్ లో నాలుగో భాగం గురించి కబురు బయటికి వచ్చింది. ముంబయిలో క్రిష్ అవతారంలో వినాయకుడిని తయారు చేయడం చూసి.. జనాలకు ఆ పాత్ర మీద ఎంత మక్కువో అర్థం చేసుకుని ఈ సిరీస్ లో మరో సినిమా తీయాలని ఫిక్సయినట్లు చెప్పాడు దర్శక నిర్మాత రాకేష్ రోషన్. ఈ సినిమా గురించి ప్రకటన చేస్తూనే.. 2018 క్రిస్మస్ పండక్కి విడుదల చేయబోతున్నట్లు కూడా వెల్లడించాడు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నాడట. 2018 క్రిస్మస్‌ కు షారుఖ్ ఖాన్ హీరోగా ఆనంద్.ఎల్.రాయ్ తీయబోయే సినిమా రిలీజవుతుందని.. వాళ్లే ముందు రిలీజ్ డేట్ ప్రకటించారు కాబట్టి.. తాము రేసు నుంచి తప్పుకుంటామని.. పోటీకి వెళ్లమని అన్నాడు రాకేష్ రోషన్. ఐతే వచ్చే ఏడాది జనవరి 26న హృతిక్ సినిమా ‘కాబిల్’ను మాత్రం రిలీజ్ చేసి తీరుతానని.. షారుఖ్ ‘రాయీస్’ సినిమాను ఆ రోజు విడుదల చేస్తారా లేదా అన్నది వాళ్లిష్టమని రాకేష్ అన్నాడు.

‘‘షారుఖ్‌ 2018 క్రిస్మస్ పండక్కి తన సినిమాను రిలీజ్ చేస్తుంటే నా సినిమా విడుదల తేదీని మార్చుకుంటాను. ఎందుకంటే నాకంటే ముందే షారుఖ్‌ సినిమా తేదీని ప్రకటించారు. మాకు సినిమాలు తెరకెక్కించడం తెలుసు తప్పితే వివాదాలు లేవనెత్తడం కాదు. అలాగే ‘కాబిల్‌’ విడుదల తేదీని నేనే ముందు ప్రకటించాను. వాళ్లు కూడా అదే రోజు రావాలనుకుంటే నేను చేసేదేం లేదు. షారుఖ్‌ఖాన్‌ నా తమ్ముడిలాంటోడు. ‘కింగ్‌ అంకుల్‌’తో అతడికి ఓ విజయం అందించాను. ‘కరణ్‌ అర్జున్‌’.. ‘కోయ్లా’ లాంటి సినిమాలకు కూడా పని చేశాం. షారుఖ్‌ ఏదైనా పద్థతి ప్రకారం చేస్తాడని నా నమ్మకం. ‘రాయీస్‌’ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు’’ అని రాకేష్ అన్నాడు. మరి రాకేష్ ఇంత మర్యాదగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో షారుఖ్ ‘రాయిస్’ విడుదల తేదీ మార్చుకుంటాడో లేదో చూడాలి.