Begin typing your search above and press return to search.

ఓటీటీ అయినా.. విలన్ రోల్స్ అయినా నేను సిద్ధమే..!

By:  Tupaki Desk   |   30 Aug 2020 2:00 PM IST
ఓటీటీ అయినా.. విలన్ రోల్స్ అయినా నేను సిద్ధమే..!
X
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నివేద కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటూ వస్తోంది. హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తానని కూర్చోకుండా వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో 'పాపనాశం' సినిమాలో కమల్ హాసన్ కూతురిగా నటించింది. నాని 'జెంటిల్ మెన్' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన నివేదా థామస్.. 'నిన్ను కోరి' 'జై లవకుశ' 'బ్రోచేవారెవరురా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ ఏడాది ప్రారంభంలో 'దర్బార్' సినిమాలో రజినీకాంత్ కూతురిగా కనిపించిన నివేదా థామస్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్'లో కీలక పాత్రలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ బ్యూటీ నటించిన 'వి' సినిమా సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని - సుధీర్ బాబు - అదితి రావ్ హైదరీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌ రాజు - శిరీష్‌ - హర్షిత్‌ రెడ్డిలు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన 'వి' ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల 'వి' సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నివేదా థామస్ పలు విషయాలు షేర్ చేసుకుంది. ఈ సినిమాలో అపూర్వ అనే క్రైమ్‌ నవలా రచయితగా కనిపిస్తానని.. ఆ పాత్ర ఎంత క్రమశిక్షణగా ఉంటుందో అంతే డేరింగ్‌ గా ఉంటుందని చెప్పింది. ఓటీటీ కోసం వర్క్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. ఇప్పుడు నేనున్న పొజిషన్ ని ఎంజాయ్‌ చేస్తున్నానని.. స్టార్‌ స్టేటస్‌ కోసం ఆలోచించనని.. మంచి నటిగా గుర్తింపు ఉంటే చాలని చెప్పుకొచ్చింది. ఇక విలన్‌ గా చేసే అవకాశం వస్తే చేయడానికి సిద్ధమేనని.. నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలంటే ఫైట్లు చేయాల్సిన అవసరం లేదని నివేదా థామస్‌ పేర్కొంది.