Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘హైపర్’

By:  Tupaki Desk   |   30 Sep 2016 10:00 AM GMT
మూవీ రివ్యూ : ‘హైపర్’
X
చిత్రం : ‘హైపర్’

నటీనటులు: రామ్ - రాశి ఖన్నా- సత్యరాజ్ - రావు రమేష్ - మురళీ శర్మ - ప్రభాస్ శీను - తులసి తదితరులు
సంగీతం: జిబ్రాన్
నేపథ్య సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
మాటలు: అబ్బూరి రవి
నిర్మాతలు: అనిల్ సుంకర - రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్

వరుస ఫెయిల్యూర్ల తర్వాత ‘నేను శైలజ’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన యువ కథానాయకుడు రామ్.. గతంలో తనకు ‘కందిరీగ’ లాంటి హిట్టిచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘హైపర్’ చేశాడు. 14 రీల్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మించిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తండ్రిని పిచ్చిగా ప్రేమించే కుర్రాడు సూర్య (రామ్). అతడికి తన తండ్రి నారాయణ మూర్తి (సత్యరాజ్) అంటే ఎంత ప్రేమంటే.. తన తండ్రి గుడిలో ఎవరో అమ్మాయిని చూసి ఆ అమ్మాయి లక్షణంగా ఉంది అంటే.. తనను చూడకుండానే ప్రేమించేస్తాడు. తనెవరో తెలియకుండానే పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సూర్య అంత పిచ్చిగా ప్రేమించే తండ్రికి ఓ మంత్రి వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేసే సత్యనారాయణ మూర్తి నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న తన మాల్ కు అనుమతి నిరాకరించడంతో మంత్రి కోపం పెంచుకుంటాడు. నారాయణమూర్తిని దెబ్బ తీయాలని చూస్తాడు. ఆ సంగతి సూర్యకు తెలిశాక ఎలా రియాక్టయ్యాడు.. తండ్రి కోసం మంత్రిని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

రామ్ చూడ్డానికి సున్నితంగా కనిపిస్తాడు. అతడి ఆకారం కూడా భారీగా ఏమీ ఉండదు. కానీ అతను మాత్రం తెరమీద వీర విన్యాసాలు చేస్తుంటాడు. లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లు.. రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిరుచి మారి.. కొత్త కథలు.. పాత్రలకు పట్టం కడుతున్నా అతను మాత్రం రొటీన్ దారిలోనే నడుస్తూ వచ్చాడు. వరుసగా ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇలాంటి తరుణంలో ‘నేను శైలజ’ రామ్ కు మేకోవర్ లాగా అనిపించింది. అందులో సామాన్యమైన పాత్రలో ఒద్దికగా నటించి మెప్పించాడు రామ్. అది చూసి రామ్ మారాడని.. ట్రాక్ లో పడ్డాడని అనుకున్నారంతా. కానీ ఆ మార్పు తాత్కాలికమే అని రామ్ ‘హైపర్’తో చూపించాడు.

తండ్రిని కొడుకు అతిగా ప్రేమించడం అనే పాయింట్ వినడానికి ఆసక్తి రేకెత్తించేదే. టీజర్.. ట్రైలర్ చూస్తే.. ఈ పాయింట్ చుట్టూ తమాషా కథాకథనాలు అల్లి మాంచి ఎంటర్టైనర్ లాగా ‘హైపర్’ను తీర్చిదిద్ది ఉంటారన్న ఆశలు కలిగాయి. ఐతే ఆ ఆశలు ఎంతో సమయం నిలవవు. టీజర్.. ట్రైలర్లలో చూపించిన సన్నివేశాలు సినిమాకు ఇంట్రోగా మాత్రమే ఉపయోగపడ్డాయి. పాత్రల పరిచయం తర్వాత ఇక ఆ సంగతి పక్కనబెట్టేసి.. రొటీన్ కథాకథనాలతో నడపించేశాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.

ఇటు హీరో ప్రేమకథ అయినా.. అటు విలన్ తో వైరం అయినా రొటీన్ అనిపిస్తాయి. స్క్రీన్ ప్లేలో కానీ.. సన్నివేశాల్లో కానీ.. కొత్తదనం కనిపించదు. సినిమాకు ఎంచుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా చిన్నది. పైగా దాన్ని రొటీన్ స్క్రీన్ ప్లేతో చెప్పడంతో ‘హైపర్’ ఒక మామూలు సినిమాగా మిగిలిపోయింది. తన తండ్రిని కాపాడిన రౌడీకి హీరో ఫ్రెండవడం.. ఆ రౌడీనే తన తండ్రిని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తుంటే హీరో హెల్ప్ చేయడం.. తర్వాత అసలు విషయం హీరోకు తెలిసి రివర్స్ అవడం.. ఈ నేపథ్యంలో సాగే ప్రథమార్ధం సినిమాటిగ్గా అనిపిస్తుంది. హీరో.. అతడి రౌడీ ఫ్రెండు అన్నీ మాట్లాడుకుంటారు కానీ.. తమ టార్గెట్ అయిన వ్యక్తి పేరు మాత్రం మాట్లాడుకోరు. ఇంటర్వెల్ వరకు టైంపాస్ చేయడానికి తగ్గట్లుగా.. ఇలా కన్వీనియెంట్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. ఈ దాగుడుమూతల వ్యవహారం ఎలా ముగుస్తుందో తెలిసిన ప్రేక్షకుడు.. ఆ మూమెంట్ వచ్చేవరకు ఎదురు చూస్తాడు.

ఇంటర్వెల్ దగ్గర రామ్ తనదైన యాటిట్యూడ్ చూపించే సీన్ బాగానే అనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ ఇక్కడ బాగానే కనెక్టవుతారు. ఐతే ద్వితీయార్ధానికి వచ్చేసరికి కథనం మరీ రొటీన్ గా.. నిస్సారంగా నడుస్తుంది. తండ్రి కొడుకును అపార్థం చేసుకోవడం.. ఇంట్లోంచి గెంటేయడం.. హీరో విలన్ పని పట్టడం.. మళ్లీ తండ్రికి దగ్గరవడం.. చివరికి క్లైమాక్స్.. ఇలా రొటీన్.. ఫ్లాట్ స్క్రీన్ ప్లేతో సినిమా సాగిపోతుంది. హీరో-విలన్ ఎత్తులు పైఎత్తులన్నీ కూడా చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. అసలు కాన్ఫ్లిక్ట్ పాయింటే చాలా చిన్నది కావడంతో అంతగా ఎమోషన్ ఉండదు.

హీరోను తండ్రి అపార్థం చేసుకోవడానికి దారితీసే సన్నివేశాలు అసహజంగా.. నాటకీయంగా తయారయ్యాయి. చిన్న వివరణతో అపార్థం తొలిగిపోయేలా ఉన్నా హీరో మాట్లాడడు. తండ్రి కూడా ఏమీ తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఇక తండ్రిలో అపార్థం తొలిగిపోయే సన్నివేశం అయితే.. మరీ నాటకీయంగా అనిపిస్తుంది. ఇలాంటి సన్నివేశాలు ఎన్ని వందల సినిమాల్లో చూశామో. పైగా రచయిత అబ్బూరి రవి ‘బొమ్మరిల్లు’ హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటపడనట్లున్నాడు. ‘మొత్తం మీరే చేశారు’ టైపులో ‘అంతా వాడికే తెలుసు’ అంటూ మురళీ శర్మ డైలాగులు చెబుతుంటే డ్రామా శ్రుతి మించి పోయినట్లుంటుంది.

విలన్ పాత్రలో రావు రమేష్ తనదైన శైలిలో వినోదం పంచుతున్నా.. సన్నివేశాలు మాత్రం సిల్లీగా సాగుతూ ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేస్తాయి. ఎప్పట్లాగే ఏ బ్యాగ్రౌండ్ లేని.. పనీపాటా లేని ‘తెలుగు సినిమా’ మార్కు హీరో.. మంత్రి గారిని అల్లల్లాడించేస్తాడు. ముప్పు తిప్పలు పెట్టి రోడ్డుమీదికి ఈడ్చుకొచ్చేస్తాడు. నిజాయితీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఇచ్చిన సందేశాలు.. పేల్చిన డైలాగులు అవీ కూడా మామూలుగా సాగిపోతాయి. బలమైన సన్నివేశాలు పడలేదు. మాటలతోనే సరిపుచ్చేశారు. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కూడా రొటీన్. సాంగ్ బ్రేక్ టైం అయింది అన్నట్లుగా హీరోయిన్ వచ్చి వెళ్తుంటుంది. రొటీన్ కథాకథనాలతో అడ్డస్టయిపోయేట్లయితే ‘హైపర్’ కొంచెం టైంపాస్ చేయిస్తుంది.

నటీనటులు:

రామ్ మళ్లీ తనకు అత్యంత ఇష్టమైన.. అలవాటైన ‘ఎనర్జిటిక్’ క్యారెక్టర్లో రొటీన్ గా లాగించేశాడు. అతడి ఎనర్జీ.. చురుకుదనం బాగానే ఉన్నాయ్ కానీ.. పాత్రలో.. నటనలో మాత్రం కొత్తదనం లేదు. ఇంటర్వెల్ దగ్గర యాటిట్యూడ్ చూపించే సీన్లో బాగా చేశాడు. రాశి ఖన్నా నటన గురించి చెప్పేదేమీ లేదు. గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. గత సినిమాల కంటే డోస్ పెంచింది. సత్యరాజ్ బాగా చేశాడు. సీరియస్ గా సాగే సన్నివేశాల్లో ఆయన తన హుందాతనం చూపించాడు. రావు రమేష్ పాత్ర మామూలుగా అనిపించినా.. ఆయన తన నటనతో దానికి ప్రత్యేకత తీసుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో చేస్తున్న తరహాలోనే చేసినా.. తెరమీద కనిపించినంతసేపూ రావు రమేష్ ఎంటర్టైన్ చేశాడు. ఎంగేజ్ చేశాడు. మురళీ శర్మ పర్వాలేదు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

జిబ్రాన్ సంగీతం నిరాశ పరుస్తుంది. కమ్ బ్యాక్ పాట మినహాయిస్తే అతడి ప్రత్యేకత చూపించే పాటలేమీ లేవు ఇందులో. సబ్జెక్టుకు తగ్గట్లుగా అతను కూడా రొటీన్ గానే లాగించేశాడనిపిస్తుంది. మణిశర్మ నేపథ్య సంగీతం పర్వాలేదు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. 14 రీల్స్ స్థాయికి తగ్గట్లే సినిమా రిచ్ గా తెరకెక్కింది. అబ్బూరి రవి రాసిన కొన్ని మాటలు బాగానే ఉన్నాయి కానీ.. కొన్ని డైలాగ్స్ డ్రమటిగ్గా అనిపిస్తాయి. స్టోరీ రైటర్ కమ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఎప్పట్లాగే రొటీన్ కథను ఎంచుకున్నాడు. ఐతే ‘కందిరీగ’ తరహాలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు. తండ్రిని పిచ్చిగా ప్రేమించే కొడుకు.. అనే పాయింట్ దగ్గర అతను ఎగ్జైట్ అయిపోయినట్లున్నాడు.ఐతే దాని చుట్టూ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే రాయడంలో విఫలమయ్యాడు. ‘రభస’ లాంటి ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన కసిలో సంతోష్ ఏదో ప్రత్యేకంగా చేస్తాడని ఆశిస్తే.. అలాంటిదేమీ జరగలేదు.

చివరగా: హైపర్.. రామ్ మళ్లీ రివర్సయ్యాడు

రేటింగ్ - 2.5/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre