Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్ల కోసం ఇంత పోటీనా..?

By:  Tupaki Desk   |   14 Dec 2017 5:30 PM GMT
రిలీజ్ డేట్ల కోసం ఇంత పోటీనా..?
X
ఈ ఏడాది ఆగస్టు 11న ఒకటికి మూడు సినిమాలొచ్చాయి. అందులో ఒక్క రానా సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ మాత్రమే పెట్టుబడి వెనక్కి తెచ్చుకుంది. ‘జయ జానకి నాయక’కు మంచి టాక్ వచ్చినా దానికి తగ్గట్లు వసూళ్లు రాలేదు. ‘లై’ సినిమాకు నెగెటివ్ టాక్ ఏమీ రాలేదు. అయినా డిజాస్టర్ అయింది. పోటీ లేకుండా రిలీజ్ చేసినట్లయితే వీటిలో వేటికదే ఇంకా మెరుగ్గా ఆడేదనడంల సందేహం లేదు. సంక్రాంతి లాంటి సీజన్లలో అయితే ఎక్కువ సినిమాలు రిలీజైనా వసూళ్లు బాగుంటాయి. కానీ మిగతా సీజన్లలో మాత్రం కష్టం. రెండు సినిమాలు పోటీ పడ్డా.. వసూళ్లపై ప్రభావం ఉంటుంది.

ఐతే టాలీవుడ్లో సినిమాల సక్సెస్ రేట్ అంతంతమాత్రంగానే ఉన్నా కొత్త సినిమాల ప్రొడక్షన్ రోజు రోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. దీంతో అన్ని సినిమాలకూ సరైన రిలీజ్ డేట్ చూసుకోవడం.. చాలినన్ని థియేటర్లు దక్కించుకోవడం చాలా చాలా కష్టమైపోతోంది. దీంతో పోటీ ఎంతున్నా పట్టించుకోకుండా రిలీజ్ చేయడానికే సిద్ధపడుతున్నారు. జనవరి 26కు ఏకంగా ఐదు సినిమాలు షెడ్యూల్ కావడం విశేషం. ‘భాగమతి’తో పాటు ‘ఆచారి అమెరికా యాత్ర’.. ‘మనసుకు నచ్చింది’.. ‘విశ్వరూపం-2’.. ‘అభిమన్యుడు’ వస్తాయంటున్నారు. ఫిబ్రవరి 2కు ‘అ’తో పాటు ‘చలో’ షెడ్యూల్ అయ్యాయి. రేసులోకి ఇంకో సినిమా వచ్చినా రావచ్చు. ఫిబ్రవరి 9వ తేదీకి ఇప్పటికే వరుణ్ తేజ్ సినిమా ‘తొలి ప్రేమ’.. బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ‘సాక్ష్యం’.. నిఖిల్ చిత్రం ‘కిరాక్ పార్టీ’ రేసులో ఉండగా.. ఇప్పుడు కొత్తగా మోహన్ బాబు సినిమా ‘గాయత్రి’ కూడా వచ్చింది. మామూలుగా ఫిబ్రవరి అంటే అన్ సీజన్‌ గా పరిగణిస్తారు. అయినప్పటికీ ఆ నెలలో సినిమాల రిలీజ్‌ కు విపరీతమైన పోటీ కనిపిస్తోంది. లేటైతే కష్టమని ఎవరికి వారు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేస్తున్నారు. కానీ పోటీ తప్పట్లేదు.