Begin typing your search above and press return to search.

అవెంజర్స్ అంచనాలు మామూలుగా లేవు

By:  Tupaki Desk   |   7 April 2018 5:30 PM GMT
అవెంజర్స్ అంచనాలు మామూలుగా లేవు
X
హాలీవుడ్ లో వచ్చే సూపర్ హీరోల సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ లో వచ్చే సినిమాల యాక్షన్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తారు. మార్వెల్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా 202 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ సినిమా ప్రియులందరి చూపు త్వరలో రాబోయే అవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్ మీదే ఉంది. సూపర్ హీరోలంతా కలిసి యుద్ధం చేసే అవెంజర్స్ సిరీస్ లో ఇది మూడో పార్ట్. మొదటి పార్ట్ 2012లో విడుదలై 207 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రెండో పార్టుకు 191 మిలియన్ డాలర్లు వచ్చాయి. మొదటి రెండు పార్టుల్లో ఐదారుగుగురు సూపర్ హీరోలే విలన్లతో తలపడ్డారు. ఈసారి ఏకంగా 17 మంది సూపర్ హీరోలు రంగంలోకి దిగబోతున్నారు. మార్వెల్ స్టూడియోస్ చరిత్రలోనే అతి భారీ బడ్జెట్ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కు సంబంధించి ఇంతవరకు 18 సినిమాలొచ్చాయి. వీటిలో కేవలం ఐదు మాత్రమే 200 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశాయి. కానీ అవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్ కు ఉన్న క్రేజ్ ను బట్టి ఈ మూవీ మొదటి వారంలోనే 200 మిలియన్ మార్కు ను చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీలో సూపర్ హీరోస్ అంతా కలిసి అతి బలవంతుడైన థానోస్ అనే విలన్ ను ఎదుర్కోబోతున్నారు. తెలుగు వెర్షన్ డబ్బింగ్ లో ఈ పాత్రకు మన భళ్లాలదేవుడు రానా డబ్బింగ్ చెప్పాడు. ఈనెల 27న ఈ సినిమా థియేటర్లకు రానుంది.