Begin typing your search above and press return to search.

గ్లామరస్ హీరోయిన్స్ ను టెన్షన్ పెట్టేస్తున్న 'ఫిదా' పిల్ల!

By:  Tupaki Desk   |   4 March 2021 6:30 AM GMT
గ్లామరస్ హీరోయిన్స్ ను టెన్షన్ పెట్టేస్తున్న ఫిదా పిల్ల!
X
ఇప్పుడు ఏక్కడ చూసినా సాయిపల్లవి పేరు మారుమ్రోగిపోతోంది. అంతా ఈ పిల్లను గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ యాక్టింగ్ ఏంటీ? .. ఆ డాన్స్ ఏంటి? పాత్రలను ఎంచుకోవడంలో ఆ తెలివితేటలు ఏంటి? అని అంతా చర్చించుకుంటున్నారు. రీసెంట్ గా 'లవ్ స్టోరీ' నుంచి వచ్చిన 'సారంగధరియా' పాటలో ఆమె డాన్స్ చూసిన వాళ్లంతా మరోసారి ఆమె గురించి ముచ్చటించుకుంటున్నారు. 'ఫిదా' సినిమా వచ్చినప్పుడు పిల్ల ఓ మాదిరిగా ఉందే అనుకుంటూ థియేటర్ కి వెళ్లినవారు, చక్కదనం ఆమె నటనలో ఉందని తేల్చేశారు.

ఇక 'మిడిల్ క్లాస్ అబ్బాయి' .. 'పడి పడి లేచె మనసు' సినిమాలు చూసినవాళ్లు, జయసుధ .. సౌందర్య తరువాత తెలుగు తెరకి మరో సహజనటి దొరికేసిందని అనుకున్నారు. తెలుగులో విడుదలైన సాయిపల్లవి సినిమాలు అరడజను లోపే. అయినా ఆమెకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకు కారణం పాత్రలో ఆమె ఒదిగిపోయేతీరు .. సున్నితమైన హాభావాలను బలంగా పలికిచ్చే పద్ధతి .. ముఖ్యంగా డాన్స్ ను కుమ్మేసే విధానం అని చెప్పాలి. ఎంత ఫాస్టుగా స్టెప్స్ వేస్తున్నప్పటికీ, ఎక్స్ ప్రెషన్ మిస్ కాకపోవడం ఆమె ప్రత్యేకత.

అలాంటి సాయిపల్లవి ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ జోడీగా ఆమె చేసిన 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. సున్నితమైన భావావేశాల చుట్టూ ఈ కథ తిరగనుంది. ఇక రానా ప్రధాన పాత్రధారిగా వేణు ఉడుగుల దర్శకత్వంలో సాయిపల్లవి నటించిన 'విరాటపర్వం' కూడా ఏప్రిల్ 30న థియేటర్లలో దిగనుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా నిర్మితమవుతున్న 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో కూడా ఆమె ఆకట్టుకోనుంది.

ఈ మూడు సినిమాల తరువాత సాయిపల్లవి క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. గ్లామరస్ హీరోయిన్లను పట్టించుకోకుండా సాయిపల్లవి తనపని తాను చేసుకుపోతోంది. కానీ చాలా తక్కువ సినిమాలతో .. తక్కువ సమయంలో తమవైపుకు దూసుకువస్తున్న సాయిపల్లవిని చూసి, స్టార్ హీరోయిన్స్ రేసులో ఉన్న గ్లామరస్ హీరోయిన్స్ సైతం టెన్షన్ పడుతున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అభినయంతోనే పడుచు మనసులను అంటించేస్తున్న అగ్గిపుల్లలాంటి ఈ పిల్లను ఆపడం ఇప్పట్లో కష్టమే.