Begin typing your search above and press return to search.

ప్రభాస్ రూటు మార్చాల్సిందే

By:  Tupaki Desk   |   31 July 2019 6:05 AM GMT
ప్రభాస్ రూటు మార్చాల్సిందే
X
బాహుబలి మంచే చేసిందో లేదో కానీ అదెలాగూ లైఫ్ టైం మెమరీగా నిలిచిపోయింది కాబట్టి ప్రభాస్ ని ఇక మామలువాడు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ళ ఆకాంక్షలో న్యాయం ఉంది. బాహుబలికి సుమారుగా ఐదేళ్ల కాలం ఖర్చయిపోయింది. ఇప్పుడు సాహోకు రెండేళ్లు. ఇలా ప్రతి సినిమాకు ఇంతేసి గ్యాప్ ఇచ్చుకుంటూ పోతే కెరీర్ మొత్తం మీద ప్రభాస్ ఎన్ని సినిమాలు చేయగలడనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఒకపక్క అప్ కమింగ్ స్టార్స్ ఏడాదికి మూడు సినిమాలతో దూసుకుపోతూ ఉంటె ఇంత బలమైన ఫాన్ ఫాలోయింగ్ ఉన్న డార్లింగ్ స్లోగా వెళ్లడం సినిమా ప్రేమికులకు సైతం మింగుడు పడని విషయమే.

పైగా సినిమా సినిమాకు బడ్జెట్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. సాహోకు రెండు వందల కోట్ల దాకా పెట్టామన్నారు. తర్వాత నిర్మాణంలో ఉన్న రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి సైతం 150 నుంచి 200 కోట్ల మధ్యలో ఖర్చవుతుందని అంటున్నారు. ఇలా వందల కోట్ల పెట్టుబడితో ప్రభాస్ గిరిగీసుకుని ఉంటే బయట నిర్మాతలకు దొరకకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రతిదీ బాహుబలి సాహో రేంజ్ లో ఉండాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా రాసుకుంటే మిర్చి లాంటి మీడియం బడ్జెట్ సినిమాతో రికార్డులు బద్దలు కొట్టొచ్చని ప్రభాసే నిరూపించాడు.

అలాంటిది కనీసం నూటా యాభై కోట్లు ఖర్చు పెట్టనిదే సినిమాలు చేయకూడదు అనేలా ఇండస్ట్రీలో మెసేజ్ వెళ్తే ప్రభాస్ ని కనీసం కలవడానికి కూడా ఇతర ప్రొడ్యూసర్లు భయపడతారు. అందుకే ఈ రెండూ పూర్తయ్యాక ప్రభాస్ కమర్షియల్ ఫ్లేవర్ ఉండే మాస్ సినిమాలు చేయడం చాలా అవసరం. యాభై నుంచి వంద కోట్ల మధ్యలో పెట్టి డార్లింగ్ తో అద్భుతమైన సినిమాలు తీయొచ్చు. అన్ని విజువల్ గ్రాండియర్ కోణంలోనే ఆలోచిస్తేనే ఇతర నిర్మాతలకు ప్రభాస్ సినిమాతో ఆలోచన చేయడం కూడా కష్టమవుతుంది. అందుకే ప్రభాస్ రూట్ మార్చమని కోరుతున్నారు ఫాన్స్