Begin typing your search above and press return to search.

'హృదయమా'.. మహేష్ మెచ్చిన 'మేజర్' ప్రేమ గీతం..!

By:  Tupaki Desk   |   7 Jan 2022 6:02 AM GMT
హృదయమా.. మహేష్ మెచ్చిన మేజర్ ప్రేమ గీతం..!
X
టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ''మేజర్''. ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 2022 ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటుగా హిందీ మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.

26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ''మేజర్'' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్చ్ తెచ్చుకుంది. ముఖ్యంగా టీజర్ యూట్యూబ్ లో మిలియన్ల కొలదీ వ్యూస్ రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా 'హృదయమా' అనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసారు.

'హృదయమా' పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేస్తూ.. ఇది తాను వ్యక్తిగతంగా ఇష్టపడిన పాట అని పేర్కొన్నారు. ఇక మలయాళ వెర్షన్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసారు. ''నిన్నే కోరేనే.. నిన్నే కోరే.. ఆపేదెలా నీ చూపునే.. నేనేలేనే.. నువ్వై నేనే..'' అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను విశేషంగా అలరిస్తోంది.

''మేజర్'' సినిమాలో సందీప్ త్యాగాల గురించి మాత్రమే కాకుండా.. ఆయన జీవితంలోని వివిధ దశలను చూపించనుంది. ఇప్పుడు 'హృదయమా' పాట ద్వారా అతని యవ్వన దశలో ప్రేమాయణం గురించి తెలియజేస్తోంది. ఇందులో మేజర్ గా అడివి శేష్.. అతని ప్రేయసిగా సయీ మంజ్రేకర్ ఆకట్టుకున్నారు. మేజర్ సరిహద్దులో విధుల్లో ఉండగా, ప్రియురాలు అతని కోసం ఎదురు చూడటం.. ప్రేమలేఖల ద్వారా తమ భావాలను పంచుకోవడం ఈ పాటలో కనిపిస్తుంది. అలానే సందీప్ - ఇషా ల మధ్య అందమైన ప్రేమకథను చూపిస్తోంది.

'హృదయమా' పాటకు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అద్భుతమైన బాణీలు సమకూర్చారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. యువ గాయకుడు సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మరోసారి మ్యాజిక్ చేసారు. ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ - ప్రకాష్ రాజ్ - రేవతి -మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు

''మేజర్'' చిత్రానికి 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. అడవి శేష్ కథ - స్క్రీన్ ప్లే సమకూర్చగా.. అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. మహేష్ బాబు యొక్క GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్‌ సంస్థతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.