Begin typing your search above and press return to search.

టాప్ స్టార్ల‌తో ప్ర‌భాస్ స్నేహగీతిక

By:  Tupaki Desk   |   17 Aug 2019 3:53 PM IST
టాప్ స్టార్ల‌తో ప్ర‌భాస్ స్నేహగీతిక
X
ప‌రిశ్ర‌మలో హీరోల మ‌ధ్య సాన్నిహిత్యం గురించి ఇటీవ‌ల అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోలంతా ఒక‌రితో ఒక‌రు స్నేహంగా మెల‌గ‌డం అనే ఆరోగ్య‌క‌రమైన ట్రెండ్ పై ముచ్చ‌ట సాగుతోంది. అయితే ఓవైపు స్టార్లు ఎంతో క్లోజ్ గా ఉంటున్నా సోష‌ల్ మీడియాలో అభిమానులు రాద్ధాంతం మాత్రం వేరొక‌లా ఉంది. మీ హీరో.. మా హీరో అంటూ విభేధాల‌తో కొట్టుకునే ధోర‌ణి ఇంకా పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు. త‌మ హీరో గొప్ప అని చెప్పుకునేందుకు ఇత‌ర హీరోల‌ను తూల‌నాడే సంస్కృతి ఇప్ప‌ట్లో త‌గ్గేట్టే క‌నిపించ‌డం లేదు.

ఫ్యాన్స్ మ‌ధ్య క‌ల్చ‌ర్ ఎలా ఉన్నా హీరోలు మాత్రం అవేవీ ప‌ట్ట‌న‌ట్టు సాటి హీరోల‌తో క‌లిసిపోతూ స్నేహం చేస్తూ ఒక మంచి వాతావ‌ర‌ణం క్రియేట్ చేస్తుండ‌డం హ‌ర్ష‌ణీయం. ఇక‌పోతే సాహో రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో కోస్టార్ల‌తో ప్ర‌భాస్ త‌న స్నేహాల గురించి రివీల్ చేశారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చాలా కాలంగా స్నేహం ఉంది. ఆ ఇద్ద‌రితో ఎంతో క్లోజ్ రిలేష‌న్ షిప్ ఉందని డార్లింగ్ చెప్పారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో స్నేహం వేరు. రాజ‌మౌళి కొడుకు కార్తికేయ పెళ్లి వేడుక‌ కోసం రాజ‌స్థాన్ వెళ్లిన‌ప్పుడు చ‌ర‌ణ్ తో ఇంకా క్లోజ్ అయ్యాడట‌. చ‌ర‌ణ్ తో మునుముందు ఇంకా క్లోజ్ అయ్యే వీలుంద‌ని ప్ర‌భాస్ తెలిపారు.

అంటే ప్ర‌భాస్ చెబుతున్న దానిని బ‌ట్టి చ‌ర‌ణ్ - బ‌న్ని- ఎన్టీఆర్ ల‌తోనూ అత‌డు భారీ మ‌ల్టీస్టార‌ర్లు చేసే వీలుందా? అన్న సందేహం క‌లుగుతోంది. ఒక‌వేళ అదే జ‌రిగితే అభిమానుల‌కు సంబ‌ర‌మే. మ‌రోవైపు ప్ర‌భాస్ - రామ్ చ‌ర‌ణ్ ద్వ‌యం క‌లిసి ఓ కొత్త త‌ర‌హా బిజినెస్ కు ప్లాన్ చేస్తున్నార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. అయితే అందుకు సంబంధించి స‌రైన స‌మాచారం తెలియాల్సి ఉందింకా. టాప్ స్టార్ల‌తో ప్ర‌భాస్ స్నేహగీతిక ఇంట్రెస్టింగ్ క‌దూ?