Begin typing your search above and press return to search.

'ప్రిన్స్' దీపావళికి రిలీజ్ అవుతుందని ఎంతమందికి తెలుసు..?

By:  Tupaki Desk   |   17 Oct 2022 5:30 PM GMT
ప్రిన్స్ దీపావళికి రిలీజ్ అవుతుందని ఎంతమందికి తెలుసు..?
X
టాలీవుడ్ లో ఈసారి దీపావళి పండుగ సందర్భంగా నాలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అందులో రెండు తెలుగు హీరోలు నటించిన చిత్రాలైతే.. మరో రెండు తమిళ హీరోలు చేసిన సినిమాలు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' - మంచు విష్ణు 'జిన్నా' - కార్తీ 'సర్దార్' - శివ‌ కార్తికేయ‌న్ నటించిన 'ప్రిన్స్' సినిమాలు అక్టోబర్ 21న విడుదల కాబోతున్నాయి.

ఒకే రోజు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. జనాల దృష్టిని ఆకర్షించడానికి ఇప్పటి వరకూ చేసిన దానికంటే మరింత దూకుడుగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరముంది. ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్ తో పాటుగా.. వరుస ఇంటర్వూలు - స్పెషల్ ప్రోగ్రామ్స్ తో బజ్ క్రియేట్ చేయగలిగితేనే మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంటుంది.

కంటెంట్ బాగుండి పాజిటివ్ టాక్ వస్తే.. లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన దీపావళి సినిమాల మేకర్స్.. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా 'ప్రిన్స్' టీమ్ మాత్రం ప్రమోషన్స్ తో ఎలాంటి హడావిడి చేయకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కోలీవుడ్ లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో శివ‌కార్తికేయ‌న్‌ నటించిన సినిమా ''ప్రిన్స్''. 'జాతిర‌త్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెరకెక్కింది. సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్మోహన్ రావు మరియు డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

ఇంత మంచి టీమ్ కలిసి చేసిన 'ప్రిన్స్' చిత్రానికి ఏమాత్రం బజ్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. అయితే దీనికి కారణం సరైన ప్రమోషన్స్ చేయకపోవడమే అని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సినిమా ఒకటి ఈ దీపావళికి రిలీజ్ అవుతుందని మెజారిటీ జనాలకు తెలియడం లేదంటే.. ప్రచార కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ చిత్రాన్ని ఫెస్టివల్ వీక్ లో విడుదల చేస్తారా? లేదా వాయిదా వేసే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'రెమో' 'వరుణ్ డాక్ట‌ర్‌' 'కాలేజ్ డాన్' వంటి సినిమాల‌తో శివ కార్తికేయన్ కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్ప‌డింది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుని సరిగ్గా ప్రమోషన్స్ చేస్తే ఎలాంటి సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా 'ప్రిన్స్' మేకర్స్ మాత్రం సినిమా పబ్లిసిటీ చేయడం లేదు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా పెద్దగా సందడి చేయలేకపోయింది.

మరోవైపు అదే రోజున రాబోతున్న 'సర్దార్' సినిమా అంతో ఇంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ డబ్బింగ్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక దీపావళి సినిమాలలో 'ఓ దేవుడా' చిత్రానికి ఎక్కువ బజ్ ఉంది. విశ్వక్ సేన్ తో పాటుగా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో భాగం అవ్వడం దీనికి ప్లస్ అవుతోంది. దీనికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు గెస్ట్‌ గా రావ‌డంతో సినిమాపై కావలసినంత సందడి కనిపిస్తోంది.

'ప్రిన్స్' విషయంలో ఇది కనిపించడం లేదు. తమిళ్ లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ.. తెలుగులో మాత్రం ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఉంటే.. ఓవర్ సీస్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అమెరికాలో ప్రచారాన్ని గాలికి వదిలేశారేమో అనిపిస్తుంది. ఇంతవరకూ ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది.. ఎక్కడెక్కడ విడుదల అవుతుందనే విషయం మీద స్పష్టత లేకుండా పోయింది.

ఏ సినిమాకైనా పబ్లిసిటీ అనేది ఎంతో కీలకం. ఇటీవల కాలంలో అగ్రెసివ్ గా ప్రమోట్ చేసిన పెద్ద హీరోల సినిమాలకే ఈ మధ్య ఓవర్ సీస్ లో అంతంత మాత్రం కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. రిలీజ్ కు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. మరి ఇప్పటి నుంచైనా 'ప్రిన్స్' మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచి జనాల దృష్టిని ఆకర్షిస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.