Begin typing your search above and press return to search.

పవన్ రెండు పడవల మీద ప్రయాణం ఎలా సాగుతుందో..?

By:  Tupaki Desk   |   30 March 2022 8:30 AM GMT
పవన్ రెండు పడవల మీద ప్రయాణం ఎలా సాగుతుందో..?
X
కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. గతేడాది 'వకీల్ సాబ్' చిత్రంతో కంబ్యాక్ ఇచ్చారు. వచ్చీ రావడంతోనే వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ అభిమానులను ఖుషీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారో ఏమో తెలియదు గానీ.. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒక మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరో ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కాకపోతే కరోనా మహమ్మారి రాకతో పవన్ కళ్యాణ్ ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి. షూటింగ్స్ ఆలస్యం అవ్వడంతో ఈ ఏడాది కాలంలో ఒక్క సినిమా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా మూడు అధికారికంగా ప్రకటించిన చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయో అని ఆలోచిస్తున్న తరుణంలో.. ఇప్పుడు పవన్ మరికొన్ని ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది.

జీ స్టూడియోస్‌ వారితో పవన్ కళ్యాణ్ రెండు సినిమాల కోసం ఒప్పందం కుదుర్చుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. 'వినోదయ సీతమ్' అనే తమిళ్ రీమేక్‌ లో నటించాడని పీకే రెడీ అవుతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే జీ గ్రూప్ సిద్ధమైంది. పీపుల్స్ మీడియా బ్యానర్ లో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ మరియు అతని మేనల్లుడు సాయి తేజ్ కలిసి ఈ రీమేక్ సినిమా చేస్తారని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు లేటెస్టుగా పవన్ తో మరో డీల్ క్లోజ్ చేసేందుకు జీ గ్రూప్ సంస్థ ముందుకు వచ్చిందట. ఈ ఒప్పందం కుదిరితే పవన్ తదుపరి రెండు సినిమాలకు జీ వారే ఫైనాన్స్ చేయనున్నారు. పవన్ డీల్స్ వెనుక అతని సన్నిహితుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహాయం చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్.

ఇటీవల 'భీమ్లా నాయక్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళాల్సి ఉంది. ఇదే క్రమంలో సురేందర్ రెడ్డి తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.

పవన్ వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతుండటంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. కానీ స్టార్ హీరో సినిమాలతో పాటుగా రాజకీయాలు కూడా చేయాల్సి ఉంది. బీజేపీ రూట్ మ్యాప్ వేస్తే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రచారం మొదలు పెట్టడానికి జనసేన అధినేత రెడీగా ఉన్నారు. అలానే ఇతర పార్టీలతో పొత్తులపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ మళ్లీ పాలిటిక్స్ లో బిజీ అయిపోతే సినిమాల షూటింగ్ లలో పాల్గొనడానికి తీరిక దొరుకుతుందా అనే సందేహాలు అభిమానుల్లో ఉంది. ఒవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు అంటూ పవన్ రెండు పడవల మీద బ్యాలన్స్ గా ప్రయాణం చేయగలరా? అని అందరూ ఆలోచిస్తున్నారు. మరి పవన్ ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.