Begin typing your search above and press return to search.

సుప్రీం హీరో మెగాస్టార్ ఎలా అయ్యారు?

By:  Tupaki Desk   |   22 Aug 2021 6:01 PM IST
సుప్రీం హీరో మెగాస్టార్ ఎలా అయ్యారు?
X
వెండి తెర‌పై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 155 సినిమాల‌తో ఇప్ప‌టికే సంచ‌ల‌నంగా మారారు. టాలీవుడ్ లో త‌న‌కంటూ కొన్ని పేజీల చ‌రిత్ర‌కు కార‌కుడ‌య్యారు. భ‌విష్య‌త్ త‌రాలు తెలుగు సినిమా చ‌రిత్ర గురించి తవ్వాల్సి వ‌స్తే అందులో క‌చ్చితంగా మెగాస్టార్ ప్ర‌స్థానం ప్ర‌త్యేకంగా కొలువై ఉంటుంది. ఎలాంటి అండ‌దండ‌లు లేకుండా న‌టుడు అయ్యి స్వ‌యంకృషితో ఇంతింతై అన్న తీరుగా ఎదిగి అటుపై సుప్రీం హీరోగా పాపుల‌ర‌య్యారు. అనంత‌ర కాలంలో మెగాస్టార్ బిరుదు త‌న కీర్తి కిరీటంలోకి చేరింది.

నిజానికి వెండితెర‌పై ఆయ‌న ప్ర‌స్థానం ప్ర‌తి నాయ‌కుడిగా ప్రారంభ‌మైంది. అటుపై నాటి అగ్ర హీరోల‌తో క‌లిసి ముఖ్య‌మైన పాత్ర‌లు చేస్తూ ఆ ద‌శ‌ను దాటుకుని హీరో వేషాల‌కు ప్ర‌మోట్ అయ్యారు. వాట‌న్నింటిని దాటుకుని నేడు 66 ఏజ్ లోనూ యువ‌హీరోల‌తో పోటీప‌డుతూ న‌టిస్తున్నారు. నేటి మేటి హీరోల‌తోనూ పోటీ ప‌డుతూ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతున్నారు.

మెగాస్టార్ రింగ్ లోకి ఎప్పుడు దిగినా పంచ్ ఒకేలా ఉంటుంద‌ని `ఖైదీ నంబ‌ర్ 150` నిరూపిచింది. ఇది మెగాస్టార్ కంబ్యాక్ మూవీ. దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత న‌టించిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ గ‌త రికార్డుల‌న్నిటినీ బ్రేక్ చేసింది. మెగాస్టార్ బ్రాండ్ ఎక్క‌డా ఇసుమొత్తు కూడా చెక్కు చెద‌రలేద‌ని ఈ చిత్రం రుజువు చేసింది. మ‌రి ఇంత‌గా మెగాస్టార్ ని అభిమానించేవాళ్లున్నారు. అస‌లింత‌కీ మెగాస్టార్ అనే బిరుదు ఆయ‌న‌కు ఎలా ద‌క్కింది? ఇండస్ట్రీలో అది ఎలా స్థిర‌ప‌డింది? అంటే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిసాయి.

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చిరంజీవి- నిర్మాత కె.ఎస్ రామారావు కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు తెర‌కెక్కాయి. తొలిసారి ఈ క‌ల‌యిక‌లో `అభిలాష` తెర‌కెక్కింది. యండ‌మూరి వీరేంద్ర నాథ్ న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని కోదండ రామిరెడ్డి తెర‌కెక్కించారు. ఇది సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది.

ఆ త‌ర‌వాత యండ‌మూరి న‌వ‌ల ఆధారంగానే `ఛాలెంజ్`.. `రాక్ష‌సుడు`..`మ‌ర‌ణ మృదంగం` చిత్రాల్ని కూడా కొదండ రామిరెడ్డినే తెర‌కెక్కించారు. ఇవన్నీ అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నాలే. అప్ప‌టివ‌ర‌కూ చిరంజీవిని అభిమానులు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు సుప్రీం హీరోగా పిలుచుకునే వారు. కానీ `మ‌ర‌ణ మృదంగం` స‌మ‌యంలో చిరంజీవిని కొత్త‌గా పిలుచుకోవాల‌ని నిర్మాత కెఎస్ రామారావు- యండ‌మూరి డిసైడ్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ అనే బిరుదుని ఇద్ద‌రూ చిరంజీవి కి ఇచ్చారు. `మ‌ర‌ణ మృదంగం` టైటిల్ కార్స్డ్ ప‌డుతోన్న స‌మ‌యంలోనే మెగాస్టార్ చిరంజీవి అనే బిరుదుతో స‌హా టైటిల్స్ వేయ‌డంతో ఆ త‌ర్వాత దానినే కొన‌సాగించారు. అలా సుప్రీంహీరో కాస్తా మెగాస్టార్ అయ్యారు. ఇప్ప‌టికే కెరీర్ లో 152 సినిమాల్లో న‌టించేసిన చిరంజీవి త‌న 66వ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని మ‌రో 3 చిత్రాల‌కు సంబంధించిన‌ప్ర‌మోషన్స్ చేస్తుంటే అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వీట‌న్నిటినీ బ్యాక్ టు బ్యాక్ షూటింగులు పూర్తి చేసి రిలీజ్ చేయడానికి చిరు ఎంతో ఉత్సాహంగా రెడీ అవుతున్నారు.