Begin typing your search above and press return to search.

సుహాసినివంటి గొప్ప నటిని మరిచిపోతే ఎలా?

By:  Tupaki Desk   |   4 March 2021 1:30 PM GMT
సుహాసినివంటి గొప్ప నటిని మరిచిపోతే ఎలా?
X
తెలుగు తెరకి నాజూకు అందాన్ని పరిచయం చేసిన నిన్నటితరం కథానాయికలలో సుహాసిని ఒకరు. ఎక్కడ ఏ సినిమాలోనూ స్కిన్ షో చేయకుండా సుదీర్ఘ కాలం పాటు కెరియర్ ను కొనసాగించడం ఆమె ప్రత్యేకత. పేరుకు తగినట్టుగా చక్కని నవ్వుతో అభిమానులను తన చుట్టూ తిప్పుకుని అగ్రకథానాయికగా వెలుగొందడం విశేషం. చిరంజీవి .. బాలకృష్ణవంటి హీరోలతో ఆమె చేసిన సినిమాలు ఎక్కువగా సూపర్ హిట్లే. అలాంటి సుహాసిని గురించి, తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.

సుహాసిని గొప్ప ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. అయినా ఆమెలో ఎంతమాత్రం గర్వం లేదు. ఆమె ఎప్పుడూ కూడా ఎవరినీ వేషం అడగలేదు. తెరపైలానే బయటకూడా చాలా డీసెంట్ గా ఉండేవారు. అప్పట్లో ఆమె చిరంజీవి కాంబినేషన్లో వరుస సినిమాలు చేశారు. అవకాశం వచ్చింది కదా అని సుహాసిని వెంటనే ఒప్పేసుకోరు. కథ .. తన పాత్ర ఆమె తప్పనిసరిగా వినేవారు .. నచ్చితేనే చేసేవారు. ఇక ఒక్కోసారి షూటింగ్ లేట్ అయినా, ఆమె ఎంతో సహనంతో సీన్ పూర్తిచేసే వెళ్లేవారు. ఆమె అంకితభావం చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని.

'మంగమ్మగారి మనవడు' వంటి సినిమాతో మాస్ హీరోయిన్ గా కూడా ఆమె అప్పట్లో మంచి మార్కులు కొట్టేశారు. సుహాసినిగారితో మేము చేసింది తక్కువ సినిమాలే అయినా, ఎక్కడ కనిపించినా ఆమె ఎంతో గౌరవిస్తారు .. ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. శారదగారి తరువాత దక్షిణాది భాషలన్నిటిలో ఉత్తమనటిగా అవార్డులను అందుకున్నది సుహాసిని మాత్రమే. అంత గొప్పనటిని పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదనిపిస్తోంది. తెలుగులో ఆమె కోసం మంచి పాత్రలు రాయాలి .. ఆమె మళ్లీ ఇక్కడి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.