Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: సూప‌ర్ హీరో కాక‌పోతే బాహుబ‌లిని కొట్టేదెలా?

By:  Tupaki Desk   |   13 Jun 2022 4:11 AM GMT
ట్రెండీ టాక్‌: సూప‌ర్ హీరో కాక‌పోతే బాహుబ‌లిని కొట్టేదెలా?
X
పాన్ ఇండియా కేట‌గిరీలో స‌త్తా చాటాల‌ని బాలీవుడ్ చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్నా అనుకున్న‌ది సాధించుకోవ‌డంలో త‌డ‌బ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక సౌతిండియ‌న్ సినిమా అందునా టాలీవుడ్ సినిమా బాలీవుడ్ పై దండ‌యాత్ర చేస్తుంటే అక్క‌డివారంతా మ‌రిగిపోతున్నారు. 1000 కోట్ల క్ల‌బ్ ని సునాయాసంగా ఎగ‌రేసుకుపోతున్నార‌న్న ఆవేద‌న ఉత్త‌రాది ఫిలింమేక‌ర్స్ లో ఉంది. దిగ్గ‌జాల్లాంటి ఖాన్ లు కుమార్ లు క‌పూర్ లు రోష‌న్ లు చాలా కాలంగా దీనిపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. తాము చేస్తున్న త‌ప్పుల‌పై రివ్యూలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ త‌ప్పుల‌ను స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని తాజాగా బ్ర‌హ్మాస్త్ర ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ వెల్ల‌డిస్తోంది.

అయితే ఇంత‌కుముందే విడుద‌లైన అక్ష‌య్ కుమార్ సామ్రాట్ పృథ్వీరాజ్ తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజైనా కానీ ఇది డిజాస్ట‌ర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు బ్ర‌హ్మాస్త్ర టీమ్ పై ఆ ఒత్తిడి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. నిజానికి బాహుబ‌లిని కొట్టేయాల‌ని తెర‌కెక్కించిన అమీర్- అమితాబ్ ల థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఇంత‌కుముందు విడుద‌లై అంతే పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఇటీవ‌ల సామ్రాట్ పృథ్వీరాజ్ ని కూడా బాహుబ‌లి 2ని టార్గెట్ చేసి మ‌రీ తెర‌కెక్కించినా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌బడింది. బాహుబ‌లి 2 ని క‌నీసం ట‌చ్ చేయ‌లేక‌పోయారు. ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 హ‌వా ముందు అయినా ఏ బాలీవుడ్ సినిమా నిల‌బ‌డ‌లేదు. ఇప్పుడు బ్ర‌హ్మాస్త్ర వ‌ర్క‌వుట‌వుతుందా? అన్న‌దే తీవ్ర‌మైన చ‌ర్చ‌గా మారింది.

నిజానికి ఆర్.ఆర్.ఆర్ లేదా బాహుబ‌లి లో ఉన్న క్వాలిటీస్ బ్ర‌హ్మాస్త్ర‌కు ఉన్నాయా? అన్న‌దే ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ. ఒక ర‌కంగా బాహుబ‌లి పాత్ర లార్జ‌ర్ దేన్ లైఫ్ ని ఎలివేట్ చేసింది. ప్ర‌భాస్ ఒక ర‌కంగా సూప‌ర్ హీరోలా క‌నిపించాడు. అందుకే అది పాన్ ఇండియా కేట‌గిరీలో ఆ రేంజులో వ‌ర్క‌వుటైంది. పైగా ప్ర‌భాస్ రాజు లోని రాజ‌సం అంత పెద్ద రీచ్ కి కార‌ణ‌మైంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు ఆ విష‌యంలో తేలిపోతున్నారు. ఇటీవ‌ల పృథ్వీరాజ్ గా న‌టించిన అక్ష‌య్ కుమార్ కి ఏజ్ ప‌ర‌మైన స‌మ‌స్య ఉంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ప్ర‌భాస్ లో ఉన్న జోష్ అత‌డిలో క‌నిపించ‌లేద‌ని కూడా తెలుగు బెల్ట్ లో విశ్లేషించారు.

అయితే తాజా ఇంట‌ర్వ్యూలో 'బ్రహ్మాస్త్ర' సూపర్ హీరో చిత్రం కాదని అయాన్ ముఖర్జీ నొక్కిచెప్పారు. ఇది చాలా నాటకీయత‌తో కూడిన ఫాంటసీ ఎపిక్ స్టోరీ అని చెబుతున్నారు. దాదాపు 7 సంవత్సరాల క్రితం ప్రకటించిన ఈ సినిమా మొదటి భాగం ఎట్టకేలకు సెప్టెంబర్ 9న థియేటర్లలోకి రానుంది. రణబీర్ కపూర్ - అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించగా అమితాబ్ బచ్చన్ - నాగార్జున అక్కినేని కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రణబీర్ 'శివుడి'గా క‌నిపిస్తాడ‌ని టాక్ ఉంది. ప‌ర‌మేశ్వ‌రుని పాత్ర‌ సూపర్ హీరో కావచ్చు అనే ఆలోచనను రేకెత్తించింది. అయితే ఇది సూపర్‌హీరో చిత్రం కాదని దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

అయాన్ మాట్లాడుతూ- ''నేను సూపర్ హీరో మేధావిని కాదు. నాకు అవెంజర్స్ - స్పైడర్ మ్యాన్ వంటి సూపర్ హీరో చిత్రాలంటే చాలా ఇష్టం... నేను పెద్ద సూపర్ హీరో అభిమానిని కాదు. నేను ఫాంటసీ సినిమాల అభిమానిని అని చెప్పాలనుకుంటున్నాను. నేను నిజాయితీగా చెబుతున్నాను. బ్రహ్మాస్త్ర సూపర్ హీరో చిత్రం కాదు. ఇది ఒక సూప‌ర్ హీరో దుస్తులు ధరించి ప్రజలను రక్షించే క‌థ‌ కాదు..అని అన్నారు. ఇది చాలా నాటకీయ పరిధిని కలిగి ఉన్న ఒక ఫాంటసీ తో కూడుకున్న పౌరాణిక కథ.. ఒక విధంగా ఇది పురాణాల నుండి నా ఆధునిక వెర్షన్ ను అందించ‌డానికి ప్రయత్నిస్తున్న నా ఫాంటసీ వెర్షన్. పురాణాల‌కు ఉన్న పరిధి చాలా పెద్ద‌ది. కానీ దానిని ఆధునిక పద్ధతిలో తెర‌పైకి తెస్తున్నామ‌ని తెలిపారు.

అయాన్ ఇంకా ఇలా అన్నాడు. ''నేను బహుశా భారతీయ మూలాల నుండి మన దేవతలు .. భారతీయ చరిత్ర కథలతో.. బహుశా సూపర్ హీరోల కంటే ఎక్కువగా ప్రభావితమయ్యాను. ఈ సినిమా నన్ను ప్రభావితం చేసిన అంశాల‌ కలయిక అని చెబుతాను. భార‌త‌దేశంలోనే అతిపెద్ద చిత్రాలలో బ్ర‌హ్మాస్త్ర‌ ఒకటి. ట్రయాలజీగా విడుదల కానున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ .. 2022 సెప్టెంబర్ 9న థియేటర్లలోకి రానుంది. అయితే ద‌ర్శ‌కుడు అయాన్ చెబుతున్న దానిని బ‌ట్టి ఇందులో లార్జ‌ర్ దేన్ లైఫ్ హీరోయిజం తెర‌పై క‌నిపించ‌దు. అలాంటి సినిమాని తెలుగులో సౌత్ లో ఏమేర‌కు క‌నెక్ట్ చేస్తారు? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. తెర‌పై లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌లు సూప‌ర్ హీరో పాత్ర‌ల్ని చూసేందుకు అల‌వాటు ప‌డిన సౌత్ ఆడియెన్ కి ఈ ఫాంట‌సీ పౌరాణిక డ్రామా ఏమేర‌కు న‌చ్చుతుంది అన్న‌ది వేచి చూడాలి.