Begin typing your search above and press return to search.

`మా` అసోసియేష‌న్ సొంత భ‌వంతి క‌ల నెర‌వేరేదెలా?

By:  Tupaki Desk   |   9 April 2021 10:00 PM IST
`మా` అసోసియేష‌న్ సొంత భ‌వంతి క‌ల నెర‌వేరేదెలా?
X
సినిమా 24 శాఖ‌లు సొంత ఆఫీస్ నిర్మాణం కోసం నిధి సేక‌రించ‌డం.. సొంత స్థ‌లం వెతుక్కుని త‌మ‌కంటూ ఒక కార్యాల‌యం నిర్మించుకోవ‌డం చూస్తున్న‌దే. ఇప్ప‌టికే టాలీవుడ్ లో కార్మిక ఫెడ‌రేష‌న్ వెంక‌టగిరి స‌మీపంలోని గాయ‌త్రి హిల్స్ (హైద‌రాబాద్) ప‌రిస‌రాల్లో సొంత బిల్డింగ్ ని నిర్మించుకుని కార్య‌క‌లాపాలు సాగిస్తోంది. ఇక చాలావ‌ర‌కూ సంఘాలు సొంత బిల్డింగుల్ని నిర్మించుకునే ప‌నిలో ఉన్నాయి. ద‌ర్శ‌క‌ర‌చ‌యితల సొంత బిల్డింగ్ కోసం ఇంత‌కుముందు నిధులు స‌మ‌కూరాయ‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇక ఇదే కోవ‌లో మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) సొంత భ‌వంతి కోసం చాలా కాలంగా క‌ల‌లు కంటున్నా అది ఎప్ప‌టికీ నెర‌వేర‌ని క‌ల‌లా మారింద‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వందేళ్ల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో 90 ఏళ్లుగా ఉనికిని చాటుకున్న‌ తెలుగు సినీప‌రిశ్ర‌మ స్థాయిని ‌పెంచుకుని ప్ర‌పంచంలోనే ఎన్నో ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆద‌ర్శ‌మ‌వుతున్న వేళ దాదాపు 900 మంది ఆర్టిస్టులు ఉన్న గొప్ప ప‌రిశ్ర‌మ‌కు ఇది సాధ్యం కాలేదా? అన్న విమ‌ర్శ‌లు పోటెత్తుతున్నాయి.

ఓవైపు కోలీవుడ్ లో తెలుగు వాడైన విశాల్ న‌డిగ‌ర‌ సంఘానికి సొంత భ‌వంతిని నిర్మించ‌డంలో కీల‌క భూమిక పోషించారు. శ‌ర‌త్ కుమార్ ప్యానెల్ పై పోరాడి నెగ్గి అధ్య‌క్షుడై సొంత భ‌వంతిని నిర్మిస్తాన‌ని స‌వాల్ విసిరి మ‌రీ అనుకున్న‌ది సాధించాడు. కానీ టాలీవుడ్ లో ఆ ప‌రిస్థితి క‌న‌బ‌డ‌డం లేదు. ఇక్క‌డ గ‌త మా అధ్య‌క్షుడైన శివాజీ రాజా కొంత వ‌ర‌కూ ఫండ్ ని క‌లెక్ట్ చేశారు. కానీ భ‌వంతిని నిర్మించ‌లేక‌పోయారు. అత‌డిపై ప్ర‌స్తుత అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేష్ అవినీతి ఆరోప‌ణ‌లు చేశారు. క‌నీసం ప్ర‌స్తుత అధ్య‌క్షుడి హ‌యాంలోనూ సొంత భ‌వంతికి క‌నీసం పునాది రాయి ప‌డే క‌ల అయినా నెర‌వేరక‌పోవ‌డంపై ఆర్టిస్టుల్లో చ‌ర్చ సాగుతోంది.

ఇక క్రైసిస్ కాలంలో దీనిపై క‌నీసం ఆలోచించేవాళ్లే క‌రువ‌య్యార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇక మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నిక‌ల‌కు స‌మ‌య‌మాస‌న్న‌మైనా ఇప్ప‌టివ‌ర‌కూ దానిపైనా స‌రైన క్లారిటీ లేద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొ‌చ్చాయి. సంఘంలోని ఆర్టిస్టుల‌కు ఇన్సూరెన్స్ వ‌గైరా మ‌ళ్లీ స‌మ‌స్య‌ల్లో ప‌డిన‌ట్టేన‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. అలాగే మా అసోసియేన్ సొంత భ‌వంతి నిర్మాణం ఇప్ప‌ట్లో సాధ్య‌ప‌డుతుందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి వీట‌న్నిటికీ సినీపెద్ద‌ల వ‌ద్ద స‌మాధానం ఉందా? అన్న ప్ర‌శ్నలు వినిపిస్తున్నాయి.