Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ ఫ్యామిలీ వారసుడిని పరిచయం చేయబోతున్న కేజీఎఫ్‌ మేకర్స్‌

By:  Tupaki Desk   |   27 April 2022 10:30 AM GMT
సూపర్ స్టార్ ఫ్యామిలీ వారసుడిని పరిచయం చేయబోతున్న కేజీఎఫ్‌ మేకర్స్‌
X
కేజీఎఫ్ సినిమాకు ముందు కన్నడ ప్రొడక్షన్‌ హౌస్‌ హంబుల్‌ ఫిల్మ్స్ పెద్దగా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే కేజీఎఫ్ 1 సినిమా సూపర్‌ డూపర్ విజయాన్ని సొంతం చేసుకుని ఉత్తర భారతం దక్షిణ భారతం అనే తేడా లేకుండా భారీ వసూళ్లను సొంతం చేసుకుందో అప్పటి నుండి కూడా హంబుల్‌ హడావుడి దేశ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆ బ్యానర్ గురించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.

తాజాగా కేజీఎఫ్ 2 సినిమా తో మరో సారి భారీ విజయాన్ని హంబుల్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌ దక్కించుకుంది. దాంతో స్టార్‌ హీరోల నుండి కొత్త హీరోల వరకు అంతా కూడా హంబుల్ బ్యానర్ లో సినిమా ను చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్‌ తో సలార్‌ సినిమాను తెరకెక్కిస్తున్న హబుల్‌ ఫిల్మ్స్ వారు కన్నడంతో పాటు హిందీలో ఇంకా పలు భాషల్లో కూడా సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు.

హంబుల్‌ బ్యానర్‌ లో ఇప్పుడు కన్నడ సూపర్‌ స్టార్‌ రాజ్‌ కుమార్‌ మూడవ తరం వారసుడు అయిన యువరాజ్ కుమార్‌ ను పరిచయం చేయబోతున్నారు. రాజ్ కుమార్‌ మనవడు అయిన యువరాజ్ కుమార్‌ హీరోగా హంబుల్‌ బ్యానర్‌ లో ఒక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించడంతో కన్నడ సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాజ్ కుమార్‌ మనవడు అయిన యువరాజ్ కుమార్‌ కోసం చాలా కాలంగా కన్నడ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలు సూపర్ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంతోష్‌ ఆనంద్రం దర్శకత్వంలో యువరాజ్ కుమార్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు. కేజీఎఫ్ సినిమా తో హంబుల్‌ బ్యానర్‌ అతి పెద్ద నిర్మాణ సంస్థ గా మారింది. అందుకే యువరాజ్ కుమార్‌ ఎంట్రీ బాధ్యతలను రాజ్ కుమార్‌ ఫ్యామిలీ మెంబర్స్ హంబుల్‌ ఫిల్మ్స్ కు అప్పగించారు.

యువరాజ్ కుమార్‌ ను కేవలం కన్నడ భాష కు పరిమితం చేయకుండా సౌత్ లో అన్ని భాషల్లో కూడా ఆయన సినిమాలను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారట. కన్నడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా అన్నట్లుగా కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా మంచి సక్సెస్‌ అయ్యేలా దర్శకుడు సంతోష్‌ ఆనంద్రం స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడు. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించి వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇక యువరాజ్ కుమార్‌ ఫోటోలను హంబుల్‌ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. తెలుగు మరియు తమిళంలో కూడా ఈయన తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.