Begin typing your search above and press return to search.

అమితాబ్ - దీపికా జంటగా హాలీవుడ్ రీమేక్..!

By:  Tupaki Desk   |   6 April 2021 5:00 AM IST
అమితాబ్ - దీపికా జంటగా హాలీవుడ్ రీమేక్..!
X
బాలీవుడ్ స్టార్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే త్వరలోనే ఓ హాలీవుడ్ రీమేక్ లో నటించనున్నారు. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ది ఇంటర్న్' మూవీని అదేపేరుతో రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను అధికారికంగా ప్రకటించారు. నిజానికి 'ది ఇంటర్న్' రీమేక్ లో దివంగత రిషి కపూర్ నటించాల్సి ఉంది. కానీ క్యాన్సర్‌తో రెండేళ్ల పోరాటం తర్వాత రిషి గత ఏడాది మరణించారు. అందుకే ఆయన స్థానంలో అమితాబ్ నటిస్తారని దీపికా తెలిపింది. ది ఇంటర్న్ పేరుతో హాలీవుడ్ హిట్ రీమేక్ చిత్రం కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "నాకు అత్యంత ప్రత్యేకమైన కో-యాక్టర్ తో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా ఉంది! స్వాగతం ది ఇంటర్న్" అంటూ దీపికా అమితాబ్ ను ఉద్దేశించి పోస్ట్ చేసింది.

అయితే అమితాబ్, దీపికా కలిసి ఇదివరకు షూజిత్ సర్కార్ దర్శకత్వంలో పికు సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే గాక ఇద్దరికి ప్రశంసలను తీసుకొచ్చింది. అలాగే అమితాబ్, రిషికపూర్ కూడా చివరిసారిగా '102 నాట్ అవుట్' సినిమాలో కలిసి పనిచేశారు. అయితే 2015లో నాన్సీ మేయర్స్ దర్శకత్వంలో ఒరిజినల్ 'ది ఇంటర్న్' విడుదలైన ఏడాదే పికు విడుదలైంది. ఒరిజినల్ లో అన్నే హాత్వే, రాబర్ట్ డి నిరో నటించిన పాత్రల్లో ఇప్పుడు దీపికా, అమితాబ్ కలిసి నటించనున్నారు. ది ఇంటర్న్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లు వసూల్ చేసింది. తన జీవితాన్ని తిరిగే మెరుగుపరచుకునే కంపెనీలో చేరిన ఓ వితంతువు కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. అయితే వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఓ పెద్దాయన ఆ మహిళ వద్ద ఇంటర్న్ గా చేరతాడు. ఈ రీమేక్ సినిమాకు 'బధాయ్ హో' ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాను సునీర్ ఖేతర్పల్, దీపికా సంయుక్తంగా నిర్మిస్తోంది.