Begin typing your search above and press return to search.

మెగా హీరో సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్..!

By:  Tupaki Desk   |   26 May 2021 12:00 PM GMT
మెగా హీరో సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్..!
X
మెగా హీరో వరుణ్‌ తేజ్‌ - బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''గని''. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. అయితే పరిస్థితులు చక్కబడిన వెంటనే సెట్స్ పైకి వెళ్ళడానికి చిత్ర బృందం రెడీగా ఉన్నారు. దీని కోసం సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

'గని' కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఒక భారీ స్టేడియం సెట్ నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ సెట్లో సినిమాకే హైలైట్ గా నిలవనున్న హై ఇంటెన్సిటీ బాక్సింగ్ ఎపిసోడ్ ని చిత్రీకరించనున్నారు. ఈ భారీ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ లార్నెల్ స్టోవల్ మరియు వ్లాడ్ రిమ్బర్గ్ లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇంతకు ముందు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సుల్తాన్’ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం వర్క్ చేసారు. ఈ క్రమంలో ఇప్పుడు మొదటిసారి తెలుగు చిత్రానికి పని చేయనున్నారు.

వరుణ్ తేజ్ 'గని' చిత్రం కోసం బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడం కోసం స్పెషల్ డైట్‌ ను పాటిస్తూ రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ లాక్ డౌన్ సమయాన్ని ఉపయోగించుకుని మరింత తీవ్రంగా శ్రమిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన వరుణ్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర - బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి - విలక్షణ నటుడు జగపతిబాబు - నదియా - నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'గని' చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో రెనసాన్స్‌ ఫిలింస్‌ - అల్లు బాబీ పిక్చర్స్ పతాకాలపై అల్లు బాబీ - సిద్ధు ముద్ద కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 30న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇంతకుముందు ప్రకటించారు కానీ, పరిస్థితులు చూస్తుంటే వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.